సీఎం జగన్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. పలు అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటూ 16 నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించి బెయిల్ పై ఉన్న ఏ1, ఏ2లు తనను విమర్శించడం హాస్యాస్పదమని రఘురామ చురకలంటిస్తున్నారు. విజయసాయి సూట్ కేసు కంపెనీలతో జగన్ కు లబ్ధి చేకూరుస్తున్నారని, సాయిరెడ్డి బండారం బయటపెడతానని, ఈ విషయంపై ప్రధాని మోదీకి లేఖ రాశానని ఆర్ఆర్ఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి జగన్, విజయసాయిలపై రఘురామ మండిపడ్డారు. బెయిల్ బ్యాచ్ అంతా కలిసి తనకు నీతులు వల్లిస్తున్నారని రఘురామ సెటైర్లు వేశారు. నిర్మలా సీతారామన్‌కు ముగ్గురు బెయిల్ ఆర్టిస్టులు ఫిర్యాదు చేశారని ఆర్ఆర్ఆర్ ఎద్దేవా చేశారు. సీబీఐ విచారణలో వారి బండారం బయటపడుతుందని అన్నారు. తమ సామాజికవర్గానికి జగన్ సర్కార్ ఇష్టానుసారంగా ఉద్యోగాలు కేటాయిస్తోందని ఆరోపించారు.
ఆవ భూముల్లో సీఎం బాబాయ్ పాత్ర ఉందని, ఆ రూ.130 కోట్లు ఎవరు కొట్టేశారో…వారి నుంచి ఇంకెవరు కొట్టేశారో అందరికి తెలుసని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆవ భూముల కుంభకోణంపై కూడా ప్రధానికి లేఖ రాశానని వెల్లడించారు. సునీల్ కుమార్ అనే అధికారిపై గతంలోనూ పలు ఆరోపణలు వచ్చాయని చెప్పారు. సునీల్ కుమార్ తన భార్య వ్యక్తిగత కంప్యూటర్ నుంచి ఇతరులకు సందేశాలు పంపారని, ఆయనపై గృహహింస కేసు కూడా నమోదై నిందితుడని కూడా తేలిందన్నారు.
తన ఫోన్ ను సునీల్ దొంగలించి.. దాన్ని ఉపయోగించి వేరే వారికి మెస్సేజ్‌లు చేశారని రఘురామ ఆరోపించారు. ఇప్పుడు తనపైనే కేసులు నమోదు చేస్తున్నారని, జగన్ సర్కార్ పెగసెస్ స్పైవేర్ ను విచ్చలవిడిగా వాడుతోందని ఆరోపించారు. సునీల్ కుమార్ వేసిన పిటిషన్ సాక్షికి, విజయసాయిరెడ్డి చేతికి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఏ1 సీఎం అవుతారని నాలుగేళ్ల కింద ఊహించి ముందే ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశానా? అని ప్రశ్నించారు.