సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ మొదలైన రెండు సంవత్సరాల తర్వాత జరుగుతున్న నాటకీయ పరిణామాలు కలకలం రేపుతున్నాయి. ఈ మర్డర్ మిస్టరీలో వివేకా ఇంటి వాచ్‌మన్ రంగయ్య కీలక వాంగ్మూలం ఇవ్వడంతో కేసు విచారణ కీలక మలుపు తిరిగింది.
అయితే, అదే సమయంలో ఈ కేసు విచారణలో కీలక పాత్ర పోషించిన సీబీఐ అధికారి సుధాసింగ్….రంగన్న విచారణ సమయంలో అక్కడ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు, రంగన్న ఎపిసోడ్ తెరపైకి వస్తున్న సమయంలో సుధాసింగ్ ను హఠాత్తుగా బదిలీ చేయడం కూడా చర్చనీయాంశమైంది. మొత్తం విచారణను ఓ కొలిక్కి తెచ్చిన సుధాసింగ్…. నిందితులకు ఉచ్చు బిగుసుకుంటున్న తరుణంలో బదిలీ కావడం సంచలనం రేపింది.
ఈ నేపథ్యంలో వివేకా మర్డర్ కేసు విచారణ, సుధా సింగ్ బదిలీ వ్యవహారాలపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. బాబాయి వివేకాను చంపినవారెవరో జగన్ కు తెలిసే ఉంటుందని, అందుకే రంగయ్య వాంగ్మూలం ఇచ్చినా దానిపై సీఎం, డీజీపీ సైలెంట్ గా ఉన్నారని షాకింగ్ కామెంట్లు చేశారు. వివేకా హత్యకు రూ.8 కోట్ల సుపారీ ఇచ్చిన ఆ ఇద్దరు ప్రముఖులెవరో ప్రజలకు జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కేసులో అరెస్టులు మొదలవుతున్న తరుణంలో డీఐజీ స్థాయి సీబీఐ అధికారి సుధాసింగ్‌ను బదిలీ చేసి, ఎస్పీ స్థాయి అధికారికి విచారణ బాధ్యతలు అప్పగించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. సుధాసింగ్ దర్యాప్తును కొనసాగిస్తే ఆ ఇద్దరు ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయని భయపడుతున్నదెవరు? ఎవరి అభ్యర్ధన ప్రకారం సుధాసింగ్‌ను ఆఘమేఘాల మీద బదిలీ చేశారు? అని వర్ల రామయ్య ప్రశ్నించారు.