ఈ రోజుల్లో సినిమాకు ప్రమోషన్ అన్నది ఎంత కీలకంగా మారిందో తెలిసిందే. సినిమాను ఎంత బాగా ప్రమోట్ చేస్తారన్నదాన్ని బట్టే దాని రీచ్, ఓపెనింగ్స్ ఉంటున్నాయి. అందుకే పెద్ద హీరోలు సైతం ఇంతకుముందులా మడికట్టుకుని కూర్చోకుండా గట్టిగా తమ చిత్రాలను ప్రమోట్ చేస్తున్నారు. ఐతే సినిమా ప్రమోషన్ రొటీన్ పద్ధతుల్లో చేస్తే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కష్టం. ఏదో ఒక వెరైటీ చేస్తేనే ఆడియన్స్ కళ్లల్లో పడటానికి అవకాశముంటుంది.
ముఖ్యంగా ప్రమోషన్ చాలా వరకు ఆన్ లైన్ రూట్లోనే నడుస్తున్న నేపథ్యంలో.. సోషల్ మీడియా ద్వారా ఎంత కొత్తగా సినిమాకు పబ్లిసిటీ చేసుకుంటారన్నది కీలకం. ఈ నేపథ్యంలోనే నాగశౌర్య కొత్త చిత్రం ‘లక్ష్య’ సినిమాకు కొత్త ప్రమోషనల్ స్ట్రాటజీని అప్లై చేస్తున్నారు. అదేంటంటే.. ప్రతి శుక్రవారం సినిమా నుంచి ఒక అప్డేట్ ఇవ్వనున్నారట. ఇది సినిమా రిలీజ్ వరకు కొనసాగుతుందట. ప్రతి శుక్రవారం ఒక అప్డేట్ అంటూ ఈ శుక్రవారం తొలి అప్డేట్ ఇచ్చారు. ఇక తర్వాతి శుక్రవారం నుంచి వారం వారం ఒక అప్డేట్ ఇస్తారన్నమాట.
వారం వారం ఒక పాట రిలీజ్ చేయడం.. తర్వాత టీజర్, ట్రైలర్ వదలడం.. ఇలా వారానికో అప్డేట్ ఇస్తూ వెళ్తారు. చివరికి ఒక శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇదీ ఎవ్రీ ఫ్రైడే అప్డేట్ ప్రమోషనల్ స్టాటజీ. నాగశౌర్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న సినిమా ‘లక్ష్య’ కావడం విశేషం. సుమంత్‌తో ‘సుబ్రహ్మణ్యపురం’ అనే థ్రిల్లర్ మూవీ తీసిన సంతోష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఏషియన్ మూవీస్ అధినేత సునీల్ నారంగ్ నిర్మాత. ఈ చిత్రంలో శౌర్య ఆర్చర్ పాత్ర పోషిస్తుండటం విశేషం. ఇప్పటిదాకా టాలీవుడ్లో చాలా స్పోర్ట్స్ డ్రామాలు వచ్చాయి కానీ.. హీరో ఆర్చర్‌గా నటించిన చిత్రమేదే లేదు. ఈ సినిమా కోసం శౌర్య సిక్స్ ప్యాక్ కూడా చేసిన సంగతి తెలిసిందే.