కరోనా వైరస్ దెబ్బకు ఒలంపిక్ విలేజ్ వణికిపోతోంది. శుక్రవారం అట్టహాసంగా ఒలంపిక్స్ క్రీడలు ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. కరోనా వల్లే జనాలను కూడా ఆటలు చూడటానికి నేరుగా స్టేడియంల్లోకి ఆహ్వానించటం లేదు. నిర్వాహకులు స్టేడియంలోకి వెయ్యిమందికి మించి ఆహ్వానితులను అనుమతించలేదు. క్రీడల నిర్వహణకు నిర్వాహకులు ఇంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న తర్వాత కూడా 106 మందికి కరోనా వైరస్ సోకిందనే విషయం వెలుగుచూసింది.
దాదాపు 205 దేశాల నుండి ఒలంపిక్స్ లో ప్రాతినిధ్యం వహించటానికి క్రీడాకారులు టోక్యోకు చేరుకున్నారు. ప్రారంభవేడుకల్లో క్రీడాకారులందరూ పాల్గొన్నారు. అయితే వీరిలో 106 మందికి కరోనా సోకటంతో ఐసొలేషన్‌లో ఉంచేశారు. అంటే 106 మందిలో క్రీడాకారులే కాదు డాక్టర్లు, మేనేజర్లు, కోచ్ లు కూడా ఉన్నారు. క్రీడాకారులు లేక కోచ్ లు లేక ఎలా పోటీపడాలో కొన్ని దేశాలకు అర్ధం కావటంలేదు.
క్రీడల ప్రారంభోత్సవం రోజున కొందరు ఆటగాళ్ళు అస్వస్తతకు గురయ్యారట. వీళ్ళను పరీక్షిస్తే 19 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణయ్యింది. కరోనా సోకినవాళ్ళంతా 14 రోజులు హోం ఐసొలేషన్‌లో ఉండాలంటే క్రీడాకారులు లేకుండానే కొన్ని ఈవెంట్లు అయిపోతాయన్నమాట. వచ్చిన వాళ్ళు రాగ అసలు తమ దేశాల్లో ఉన్నపుడే కొన్ని వందల మంది ఆటగాళ్ళకు కరోనా సోకిందని నిర్ధారణయ్యింది. చివరి నిముషంలో వాళ్ళకు ప్రత్యామ్నాయంగా వేరే ఆటగాళ్ళను ఎంపిక చేసి పంపినా వాళ్ళకూ టోక్యలో అడుగుపెట్టగానే కరోనా వైరస్ సోకింది.
కరోనా సోకిన వాళ్ళల్లో జిమ్నాస్టులు, సైక్లిస్టులు, అథ్లెట్లున్నట్లు సమాచారం. వీళ్ళల్లో కూడా అత్యధికంగా చెక్ రిపబ్లిక్ ఆటగాళ్ళే ఉన్నారట. వివిధ దేశాలకు చెందిన వేలాదిమంది ఆటగాళ్ళు ఒకే చోట బస చేయాల్సి రావటంతో ఒకరినుండి మరొకరికి చాలా తొందరగానే కరోనా సోకుతున్నట్లు నిర్వాహకులు గ్రహించారు. కానీ ఇపుడు చేయగలిగేది కూడా ఏమీలేదని అర్ధమైపోయింది. మరి ఇంకెంతమందికి సోకుతుందో అనే టెన్షన్ పెరిగిపోతోంది. అసలు ఒలంపిక్స్ జరుగుతుందా ? లేకపోతే అర్ధాంతరంగా ముగుస్తుందా అనేది కూడా అనుమానమే.
ఎన్ని సందేహాలు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ ఒలింపిక్ గ్రామ నివాసితులకు, సాధారణ జపాన్ ప్రజలకు ఏంచెబుతున్నారంటే., ఈ ఆటలు “ప్రమాద రహితంగా ఉంటాయని” అంటున్నారు. ప్రతి నాలుగు సంవత్సరాలకు కొత్త ఒలింపిక్ విలేజ్‌ను నిర్మిస్తారు. వేలాది మంది అథ్లెట్లు ఆటల పోటీలలో పాల్గొంటారు. ఈ సంవత్సరం మునుపటిలా వేడక రంగరంగ వైభవంగా ఉండదు. ఎందుకంటే ఒలింపిక్ గ్రామంలో ప్రతిచోటా తప్పనిసరి ఫేస్ మాస్క్‌లతో కనిపిస్తున్నారు. దూరం దూరంగా కనిపిస్తున్నారు.
3,000 మంది వ్యక్తులు కూర్చునే క్యాంటీన్లో ప్రతి సీటు ఒక గదిలా తయారుచేశారు. గ్లాస్ తో వేరు చేశారు. దీనివల్ల అంటువ్యాధి ప్రబలకుండా ఉంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈసారి ఆ కళ లేదు. ఆ వైభవం లేదు. కారణం మాత్రం కరోనాయే.