రాక్షసంగా జనానికి కీడు చేసే యంత్రాంగమే రాజకీయం అని తెలుగు సినిమాలో ఓ పాపులర్ డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ వచ్చి రెండు దశాబ్దాలు గడిచినా…నేటి నేతలకు ఈ డైలాగ్ సరిగ్గా సరిపోతుంది. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఓ మాట…అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట చెప్పడం రాజకీయ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. ఈ విద్యలో వైసీపీ నేతలంతా ఆరితేరి…ఆ విద్యలో అన్ని మెళకువలు అవపాసన పట్టారని విమర్శలు వస్తున్నాయి.
ప్రతిపక్షంలో ఉన్నపుడు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకమని చెప్పిన వైసీపీ నేతలు..నేడు అధికారంలోకి వచ్చాక లాటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలు జరుపుతున్నారని టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ నేతలు గిరిజన సంపదను దోచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు గిడ్డి ఈశ్వరి ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా, విశాఖ జిల్లాకు మద్యలోని సరుగుడు పంచాయితీలో వైసీపీ నేతల ఆద్వర్యంలో జరుగుతున్న బాక్సైట్ తవ్వకాల్ని టీడీపీ గిరిజన నేతలం వెలికితీశామని, దీనిపై కేంద్ర పర్యావరణ అటవీ శాఖా మంత్రి ఉపేంద్ర యాదవ్ కు లేఖ రాస్తున్నామని తెలిపారు. ఏజెన్సీ ఏరియాల్లో మైనింగ్ తవ్వకాలు జరపొద్దన్న సుప్రీం కోర్టు తీర్పునకు వైసీపీ నేతలు తూట్లు పొడుస్తున్నాని మండిపడ్డారు.
బాక్సైట్ తవ్వకాలపై గిరిజనుల ఆందోళనను జగన్ పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైవీ సుబ్బారెడ్డి కొడుకు లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలు యథేచ్ఛగా జరుపుగున్నారని ఆరోపించారు. ఆ తవ్వకాల పరిశీలనకు వెళ్లిన తమపై అక్రమ కేసులు బనాయించారని, వాస్తవాలు బయటకు రాకుండా ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. బాక్సైట్ తవ్వకాలపై పూర్తి ఆధారాలున్నాయని,ఎవరినీ వదిలిపెట్టేది లేదని ఆనంద్ బాబు వార్నింగ్ ఇచ్చారు.