ఏపీలో టీడీపీ నేతలను వైసీపీ ప్రభుత్వం తన అధికారం, అండదండలతో భయభ్రాంతులకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీలో కీలక నేతలకు గాలం వేస్తున్న జగన్….సామ, దాన, భేద దండోపాయలనుపయోగించి తమ పార్టీకి మద్దతు పలికేలా చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. తమ వ్యాపారాలు దెబ్బతింటాయేమోనన్న భయంతో కొందరు పార్టీ మారారని ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి మద్దతు ప్రకటించి…పార్టీలో చేరకుండా, టీడీపీ తరఫున గెలిచిన శాసనసభ్యత్వానికి రాజీనామా కూడా చేయకుండా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇక, మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీలో కీలక పదవులు నిర్వహించిన వారిపైనా ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తోందని చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే టీడీపీ మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి రాజీనామా చేశారు. ఆమె త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా టీడీపీకి గుంటూరు జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్ ఖాన్ తాజాగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో జియావుద్దీన్ వైసీపీలో చేరారు. జగన్ మైనారిటీలకు డిప్యూటీ సీఎంతో సహా అనేక పదవులు ఇచ్చి ఎంతో గౌరవిస్తున్నారని జియావుద్దీన్ అన్నారు. అందుకే వైసీపీలో చేరానని, టీడీపీలో తనకు అన్యాయం జరిగిందని అన్నారు. టీడీపీ సీనియర్ నేత, దివంగత లాల్ జాన్ బాషా సోదరుడు జియావుద్దీన్ గుంటూరు టీడీపీలో సీనియర్ నేతల్లో ఒకరిగా ఉన్న సంగతి తెలిసిందే.