చిత్తూరు జిల్లాలో కీలకమైన నియోజకవర్గం పీలేరు. ఇది ఒకరకంగా కాంగ్రెస్‌కు కంచుకోట. గతంలో మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ఇక్కడ నుంచి 2009లో విజయం దక్కించుకోగా.. కాంగ్రెస్ నేతగా ఉన్న చింతల రామచంద్రారెడ్డి వైసీపీ తరఫున వరుస విజయాలు దక్కించుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. దీనికి ముందు కూడా.. కాంగ్రెస్ తరఫున పలువురు పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ఇక్కడ టీడీపీ కేవలం మూడు సార్లు మాత్రమే 1983, 1985, 1994లో విజయం సాధించింది. ఆ తర్వాత మళ్లీ ఇక్కడ సైకిల్ జాడ కనిపించలేదు.
ఇలాంటి నియోజకవర్గంలో వైసీపీని బలోపేతం చేసి, కాంగ్రెస్ వర్గాన్ని వైసీపీలోకి తెచ్చి.. పార్టీకి వరుస విజయాలు అందిస్తున్న చింతల రామచంద్రారెడ్డి.. పార్టీలో తనకు గౌరవప్రదమైన నామినేటెడ్ పదవి దక్కుతుందని.. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. మంత్రి వర్గంలో ఎలాగూ అవకాశం చిక్కదని ఆయన ఎప్పటికప్పుడు చెబుతున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తనకు కేబినెట్‌పై ఆశలు లేవని ఆయన తన అనుచరులతో చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన టీటీడీ బోర్డులో మెంబర్ పదవిని ఆశించారు. గతంలో రెండేళ్ల కిందట ఏర్పాటైన బోర్డులో స్థానం కోసం ప్రయత్నించారు. అయితే.. తదుపరి.. బోర్డులో చోటు ఇస్తామని అన్నారు.
కానీ, ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఇవ్వబోమని చేసిన తీర్మానంతో చింతల ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది. ఇదిలావుంటే.. తాజాగా జరిగిన నామినేటెడ్ పదవుల పంపిణీలోనూ చింతల వర్గానికి ప్రాధాన్యం లేకుండా పోయిందనే వాదన వినిపిస్తోంది. మొత్తంగా అంతా కూడా మంత్రి పెద్దిరెడ్డి దూకుడు కనిపించడం, చింతల వంటి సీనియర్లను పక్కన పెట్టడం.. జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. జిల్లా వైసీపీ శాసనసభ్యులందరిలోకీ సీనియర్ అయిన చింతల రామచంద్రారెడ్డికి తాజా నామినేటెడ్ పదవుల భర్తీ నిరాశనే మిగిల్చింది. రెండేళ్ళ కిందట వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడే తనకు కీలక పదవి దక్కుతుందని ఆశించారు.
జిల్లాలోని పరిస్థితుల కారణంగా మంత్రివర్గంలో కాకపోయినా చీఫ్‌విప్ పదవి లేదా కీలక కార్పొరేషన్ పదవైనా ఇస్తారని భావించారు. కానీ అలా జరగలేదు. దీంతో రెండేళ్ళ పాటు ఓపికగా నిరీక్షించిన ఆయన తాజా నియామకాల్లో అవకాశం దక్కుతుందని ఆశించారు. తీరా నామినేటెడ్ పదవుల భర్తీలో ఎమ్మెల్యేలకు అవకాశం లేదని విధానపరమైన నిర్ణయం తీసుకోవడంతో అధమపక్షంగా దక్కుతుందనుకున్న టీటీడీ బోర్డు మెంబరు పదవి కూడా వచ్చే అవకాశం లేకుండా పోయినట్టయింది. దీంతో ఆయన, ఆయన వర్గం తీవ్ర నైరాశ్యానికి లోనవుతోంది.