ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నామినేటెడ్ పదవుల వ్యవహారంపై అనేక విశ్లేషణలు, విమర్శలు వస్తున్నాయి. మహిళా సాధికారతకు పెద్దపీట వేశామని.. ఇప్పటి వరకు దేశంలోను, రాష్ట్రంలోనూ కనీవినీ ఎరుగని విధంగా పదవులు కట్టబెట్టామని.. గొప్పలు చెబుతున్న వైసీపీ సర్కారు.. ఈ పదవుల పందేరంలో గిమ్మిక్కులు చేసిందనే విమర్శలు వస్తున్నాయి. కీలకమైన, ప్రధాన మైన, ఆదాయ వనరులు ఎక్కువగా ఉన్న పదవులను మహిళలకు కేటాయించలేదు. అంతేకాదు.. ఇతర సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చామని.. వారికి న్యాయం చేశామని చెబుతున్నా.. ఆయా పదవులను ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కూడా కేటాయించలేదు.
ఇక, మరికొన్ని చిత్రాలను చూస్తే.. ఎక్కడా ఉనికిలో లేని, చెల్లుబాటుకాని పోస్టులను ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి బలహీనవర్గాలకు కేటాయించారు. నామినేటెడ్ పదవులకు మొత్తం 137 మందిని ప్రభుత్వం నామినేట్ చేసింది.ఈ క్రమంలో ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని స్థాయిలో కార్పొరేషన్లు, అకాడమీలకు చైర్మన్ పదవులు ఇచ్చామని, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట వేశామని చెప్పుకొన్నారు. కానీ, ఇందులోనే అయిన వారికి ఎక్కువ ప్రాధాన్యంతోను, కానివారికి తక్కువ ప్రాధాన్యంతోను పదవులు కట్టబెట్టడం గమనార్హం. కార్పొరేషన్లను పరిశీలిస్తే ఒక్క సమావేశం జరపాల్సిన అవసరం కూడా లేని కార్పొరేషన్లు, అకాడమీలే ఎక్కువ. ఇక, ఇప్పటి వరకు అసలు వినని పేర్లతోనూ కార్పొరేషన్లు తెరమీదికి రావడం గమనార్హం.
కేవలం సంఖ్య కోసమే తప్ప.. చైర్మన్లు నిలబడటానికి కూడా చోటు లేని వాటినెన్నింటినో ప్రకటించారు. గొప్పగా ఇచ్చామని చెప్పుకోవడానికి ఆర్టీసీ రీజినల్ బోర్డు పదవులనూ ‘రాష్ట్రస్థాయి’లో చూపించుకొన్నారు. మళ్లీ అందులో ఒకే రీజియన్‌లో రెండు పదవులు పంచేశారు. జాబితా ‘భారీ’గా కనిపించాలని పడరాని పాట్లు పడినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. రాజమండ్రి అసలు స్మార్ట్‌సిటీగా ఎంపిక కాలేదు. విశాఖ, కాకినాడ, తిరుపతిని కేంద్రం స్మార్ట్‌సిటీలు జాబితాలో పెట్టింది. కానీ, రాజమండ్రికి స్మార్ట్ సిటీ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేయడమేకాదు.. చైర్మన్‌ని కూడా నియమించేసింది. స్మార్ట్ సిటీ అనేది కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఒక కాన్సెప్ట్.
కొన్ని నగరాలను ఎంపిక చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మెరుగైన వసతులతో స్మార్ట్ స్థాయికి తీర్చిదిద్దడం దాని లక్ష్యం. రాష్ట్రంలో ఓ వైపు అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీలున్నాయి. మరో పక్క ఎన్నికైన పట్టణ స్థానికసంస్థలున్నాయి. స్మార్ట్‌సిటీకి నియమించిన చైర్మన్ ఏం చేస్తారో దానిని సృష్టించిన మేధావులకే తెలియాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏలేశ్వరం అనేది ఒక చిన్న ఊరు. దానికి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి చైర్మన్‌ను నియమించడంపై అంతా విస్తుపోయారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఇప్పటికే కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. దానికి ఉన్నతాధికారులను నియమించింది. అయితే, దా నికి కూడా చైర్మన్‌ను నియమించి ఆశ్చర్యపరిచారు.
రాజమండ్రిలోని హితకారిణి సమాజం చైర్మన్ పదవి ని గతంలో స్థానికంగా ఉన్న వారికి ఇచ్చేవారు. కందుకూరి వీరేశలింగం పంతులు ఆశయాలను ప్రచారం చేసేందుకు ఉద్దేశించిన సమాజమిది. ఆ సమాజం చైర్మన్ పోస్టు ఇప్పుడు ముమ్మడవరం వ్యక్తికి ఇచ్చారు. ఈస్ట్ డెల్టా కార్పొరేషన్, వెస్ట్ డెల్టా కార్పొరేషన్, సెంట్రల్ డెల్టా కార్పొరేషన్ అంటూ కాగితాలకే పరిమితమైన పలు కార్పొరేషన్లు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. వాటన్నింటికీ చైర్మన్లను నియమించారు. ఇప్పటి వరకు వినని సోషల్ జస్టిస్ సలహాదారు పోస్టును సృష్టించి మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌కు అప్పగించారు. ఎప్పుడూ వినని హిస్టరీ అకాడమీని ఏర్పాటు చేసి ‘చరిత్ర’ సృష్టించారు. మొత్తంగా చూస్తే.. పదవుల పందేరంలో వైసీపీ గిమ్మిక్కిలు ఊహలకు కూడా అందడం లేదని అంటున్నారు పరిశీలకులు. ఏదైనా.. జగన్మాయ.. జగనన్న మాయ అంటున్నారు!