2019 ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో కోలుకోనుందా అంటే అవుననే అంటున్నాయి దేశంలోని రాజకీయ పరిస్థితులు.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఈసారి ప్రశాంత్ కిశోర్ పనిచేయనుండడం చంద్రబాబుకు కచ్చితంగా కలిసొచ్చే అంశమనే చెప్పాలి.
మోదీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రశాంత్ కిశోర్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం పనిచేయబోతున్నారు.
కాంగ్రెస్ పార్టీ కూడా ఉత్తరాదిన బీజేపీని ఎదుర్కోవడం అంత సులభం కాదు కాబట్టి దక్షిణాదిలో ఎక్కువ సీట్లు సాధించే దిశగా పావులు కదుపుతోంది.
తమకు పట్టుకున్న కర్ణాటక, కేరళలతో పాటు మిగతా రాష్ట్రాలైన తమిళనాడు, ఏపీ, తెలంగాణలపై దృష్టి సారిస్తోంది.
తమిళనాడులో ఇప్పటికే తమ అనుకూల పార్టీ డీఎంకే అధికారంలో ఉంది. తెలంగాణలో పాలక టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత పెరుగుతుండడంతో పాటు అక్కడ రేవంత్ రెడ్డి రూపంలో తురుపు ముక్క పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉండడంతో అక్కడా సీట్లు పెరుగుతాయన్న కచ్చితమైన లెక్కలలో ఉంది కాంగ్రెస్ పార్టీ.
ఇక దక్షిణాదిన మిగిలింది ఆంధ్రప్రదేశ్.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం మంచి మెజారిటీతో గద్దెనెక్కిన వైసీపీ కేంద్రంలోని బీజేపీతో అంటకాగుతోంది.
అయితే, ఇష్టారాజ్యంగా పథకాల పేరుతో డబ్బు ప్రజలకు పంపిణీ చేస్తుండడం వారికి కలిసొచ్చే అంశంగా కనిపిస్తున్నప్పటికీ ఆ పంపిణీ కోసం డబ్బు అవసరమై ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాలు, పెన్షన్లు సకాలంలో ఇవ్వలేకపోవడం, డీఏలు ఇవ్వకపోవడం, పీఆర్సీల ఊసే లేకపోవడం వంటి కారణాలతో పథకాల లబ్ధిదారులు కాకుండా మిగతా వర్గాలలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది.
ఇదే సమయంలో చంద్రబాబు, లోకేశ్‌ల నాయకత్వంలోని టీడీపీ దూకుడుగా పనిచేస్తోంది.
పైగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసిన టీడీపీ ఇప్పటికీ అదే కూటమిలో కొనసాగుతోంది.
గత ఎన్నికల్లో పనికిరాని కాంగ్రెస్ పొత్తు ఈసారి చంద్రబాబుకు కలిసొచ్చే అవకాశాలు 100 శాతం కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిశోర్ పనిచేయడం. ఏపీలో కాంగ్రెస్ అత్యంత బలహీనంగా ఉండడంతో ఇక్కడ ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌తో పొత్తు ఉన్న చంద్రబాబు పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సి ఉంటుంది.
ఏపీ రాజకీయ క్షేత్రంలో ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే తన సక్సెస్ నిరూపించుకున్నారు. గత ఎన్నికలలో జగన్ కోసం పనిచేసి వైసీపీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు.
వైసీపీ అసలు బలం ఎంత, ఆ పార్టీపై పైచేయి సాధించడం ఎలా అనేది ప్రశాంత్ కిశోర్‌కు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో.
చంద్రబాబు అనుభవం, లోకేశ్ ప్రజా సంక్షేమాభిలాషకు ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు తోడయితే వైసీపీ ఓటమి, టీడీపీ విజయం ఖాయమనే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.