క్రిస్ గేల్…క్రికెట్ ప్రేమికులకు పరిచయం అక్కర లేని పేరు. ఆరడుగుల ఈ కరీబియన్ క్రికెటర్ క్రీజులో ఉంటే చాలు..ప్రత్యర్థి బౌలర్లకు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. గేల్ అరవీర భయంకరంగా హిట్టింగ్ చేస్తుంటే స్టేడియం సిక్సర్లతో దద్దరిల్లిపోవాల్సిందే. టీ20ల్లో తన ధనాధన్ బ్యాటింగ్ తో చెలరేగిపోయే గేల్…కళ్లు జిగేల్ మనేలా ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ లో ఆడాడు.
అందుకే, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను గేల్ ను ‘యూనివర్స్ బాస్’ అని ముద్దుగా పిలుచుకుంటారు. గేల్ బ్యాట్ పై కూడా ‘యూనివర్స్ బాస్’ అని రాసి ఉంటుంది. అయితే, తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్ సందర్భంగా గేల్ బ్యాట్ పై ‘ది బాస్’ అని మాత్రమే రాసి ఉండడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై గేల్ ఇచ్చిన క్లారిటీని క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియో రూపంలో షేర్ చేసింది.
అయితే, తాను ఇకపై ‘యూనివర్స్ బాస్’ కాదని, కేవలం బాస్ అని గేల్ వెల్లడించాడు. ‘యూనివర్స్ బాస్’ పై ఐసీసీకి కాపీరైట్స్ ఉన్నాయని, అందుకే ఐసీసీ అభ్యంతరం తెలపడంతో తన బ్యాట్‌పై ‘ది బాస్’ అని మాత్రమే ఉందని క్లారిటీ ఇచ్చాడు. సాంకేతికంగా క్రికెట్లో ఐసీసీయే బాస్ అని, కానీ, బ్యాటింగ్‌లో నేనే బాస్ కాబట్టి తన బ్యాట్ పై అలా రాసుకున్నానని గేల్ బదులిచ్చాడు.
తాజాగా, ఆసీస్ తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో గేల్ మరో మెరుపు ఇన్నింగ్స్ తో తన జట్టును గెలిపించాడు. దీంతో, మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే విండీస్ 3-0తో సిరీస్ గెలుచుకుంది. మూడో టీ20లో సత్తా చాటిన గేల్ (38 బాల్స్‌లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 67) మరో అరుదైన ఘనత సాధించాడు. క్రిస్ గేల్ టీ20ల్లో 14 వేల రన్స్ చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 431 టీ20 మ్యాచ్‌లు ఆడిన గేల్ ఈ ఫీట్ సాధించిన తొలి క్రికెటర్ గా అవతరించి ‘ది బాస్’ అనిపించాడు.