జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పక్కలో బల్లెంలా మారిన సంగతి తెలిసిందే. జగన్ పై, వైసీపీ నేతలపై రఘురామరాజు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్న వైనంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జగన్ పాలనను ఎండగడుతూ…ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్న రఘురామ రాజు వైనం వైసీపీ నేతలకు మింగుడుపడడం లేదు.
దీంతో, ఏం చేయాలో పాలుపోని వైసీపీ ఎంపీలు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి పాత పాటకే కొత్త పల్లవి జోడించి వస్తున్నారు. అయితే, తనపై అనర్హత వేటు వేయలేరని, తనపై అనర్హత వేటు వేయడం అంత ఈజీ కాదని రఘురామ పలుమార్లు ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గతంలోనే రఘురామపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు పలుమార్లు ఫిర్యాదు చేసిన వైసీపీ ఎంపీలు…తాజాగా మరోసారి ఫిర్యాదు చేశారు. పిటిషన్ వేసి ఏడాది గడిచిందని, తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. స్పీకర్ చర్యలు తీసుకోకుంటే పార్లమెంట్లో ఆందోళన చేపడతామని, అవసరమైతే పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామని అన్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్ వ్యవహారంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. రఘురామ అనర్హత పిటిషన్ విషయంపై రన్నింగ్ కామెంటరీ చేయలేమని ఓం బిర్లా అన్నారు. అనర్హత పిటిషన్‌పై చర్యలకు ఒక ప్రక్రియ, పద్ధతి ఉంటుందని, ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సభలో నిరసన తెలిపే హక్కు ఏ సభ్యుడికైనా ఉంటుందని అన్నారు.