గత కొద్ది నెలలుగా సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించి ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చిన జగన్…తన బెయిల్ ను దుర్వినియోగపరుస్తున్నారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తన సీఎం హోదాను ఉపయోగించి జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై సీబీఐ తటస్థంగా వ్యవహరిస్తోందని, అంటీ ముట్టనట్టుగా ఉంటోందని విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా ఈ పిటిషన్ పై నిన్న విచారణ జరుగగా…జగన్, రఘురామ తమ వాదనలను లిఖితపూర్వకంగా కోర్టుకు సమర్పించారు. జగన్ బెయిల్ ను దుర్వినియోగపరుస్తున్నారనేందుకు తన పై బనాయించిన రాజద్రోహం కేసే నిదర్శనమని రఘురామ లేఖలో తెలిపారు. జగన్ కు బెయిల్ వచ్చినందు వల్ల తాను కూడా ఓ బాధితుడిగా మారానని అన్నారు.
అయితే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామపై అనర్హత వేటు వేయమన్నందుకే తన బెయిల్ రద్దు చేయాలని కక్షపూరితంగా రఘురామ పిటిషన్ వేశారని జగన్ లేఖలో తెలిపారు. ఇక, తాము లిఖిత పూర్వకంగా వాదనలు సమర్పించలేమంటూ సీబీఐ తెలిపింది. ఈ వాదనలను పరిశీలించిన సీబీఐ ప్రత్యే కోర్టు ఈ పిటిషన్ తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ పుకారు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో వైసీపీ అధినేత జగన్ ది, ఆ పార్టీ నేతలది అందెవేసిన చెయ్యి అని, అదే కోవలో సీబీఐ కోర్టు స్టాఫ్ ను కూడా జగన్ అండ్ కో మేనేజ్ చేసి కోర్టులోని సర్వర్లు డౌన్ అయ్యేలా చేశారని పుకార్లు వినిపిస్తున్నాయి. అందుకే, జగన్ బెయిల్ రద్దు కేసులో పురోగతి ఉండడం లేదని విమర్శలు వస్తున్నాయి.