కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తగ్గట్టుగానే తెలంగాణ టీడీపీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ షాకిచ్చారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ఎల్.రమణ అధికారికంగా ప్రకటించారు. తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు రమణ పంపారు. అంతేకాదు, తాను ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో టీఆర్ఎస్ లో కూడా చేరబోతున్నట్టు తెలిపారు. అంతేకాదు, తన రాజకీయ ఎదుగుదలకు తోడ్పాటు అందించిన చంద్రబాబుకు రమణ కృతజ్ఞతలు తెలిపారు.
నిన్న రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమమైన రమణ…సుదీర్ఘంగా పలు రాజకీయ అంశాలపై చర్చించారు. సైకిల్ దిగిన రమణ త్వరలోనే కారు ఎక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిపొందారు. అయితే, ఈటల రాజీనామా చేసిన హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికలో రమణను బరిలోకి దించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.పద్మశాలి సామాజికవర్గానికి పార్టీలో రాష్ట్రస్థాయి నాయకుడు లేని నేపథ్యంలో ఆ లోటును రమణతో భర్తీ చేయాలని సారు అనుకుంటున్నారట.
బీసీ నేత అయిన ఈటలను ఎదుర్కొనేందుకు మరో బీసీ నేత అయిన రమణను రంగంలోకి దించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. మరోవైపు, గులాబీ కండువా కప్పుకున్న వేళ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖాయమైందని ఇప్పటికే జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రమణ టీఆర్ఎస్ లో చేరడంలో ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. మరి, రమణ స్థానంలో టీడీపీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారన్న దానిపై ఆసక్తి ఏర్పడింది. తెలంగాణలో టీడీపీ నిర్వీర్యం అయిపోతున్న సమయంలో రమణ రాజీనామా గట్టి ఎదురుదెబ్బ వంటిదని అంటున్నారు.