ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలోని రుషికొండ భూముల్ని హస్తగతం చేసుకున్నారన్న ఆయన.. బినామీ లావాదేవీలపై తక్షణం స్పందించాలని కోరారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ క్విడ్ ప్రోకో-2కు తెర తీశారన్నారు. తన తండ్రి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సమయంలో క్విడ్ ప్రోకో-1కు తెర తీశారని.. ఇప్పుడు ‘‘2’’ను స్టార్ట్ చేసినట్లుగా మండిపడ్డారు.
హెటిరో ముసుగులో విశాఖ బే పార్కు బినామీల పేరుతో రూ.300 కోట్ల విలువైన రిషికొండ భూములు జగన్ హస్తగతమైనట్లుగా ఆయన ఆరోపణలు చేశారు. అరబిందో కు కాకినాడ సెజ్ కట్టబెట్టిన జగన్.. హెటిరోకు విశాఖ బే పార్కను కట్టబెడుతున్నట్లు చెప్పారు. ఈ ఒప్పందాన్ని ఆయన తీవ్రంగా తప్పు పడుతున్నారు. తమ ప్రభుత్వ హయాంలో రుషికొండ వద్ద అంతర్జాతీయ స్థాయిలో ఎకో టూరిజంలో భాగంగా కొండ మీద.. కింద 36 ఎకరాల్లో అంతర్జాతీయ పర్యాటక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినట్లు గుర్తు చేసిన ఆయన.. ఈ ప్రాజెక్టు చేతులు మారటంపైన అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎవరి ఒత్తిళ్ల మేరకు అధిక వాటాల్ని హెటిరో దక్కించుకుందన్న ప్రశ్నల్ని యనమల లేవనెత్తుతున్నారు. కొండ మీద వాటాల కొనుగోళ్లకు ప్రతిఫలంగా కొండ కింద రూ.225 కోట్లు విలువ చేసే తొమ్మిది ఎకరాల్ని ఆ సంస్థకు ఎలా అప్పజెబుతారని నిలదీశారు. గతంలో జడ్చర్ల సెజ్ లో 75 ఎకరాలు హెటిరో కు కేటాయించినందుకే జగన్ సంస్థలో రూ.19.50 కోట్లు పెట్టారని గర్తు చేశారు.
హెటిరో అనుబంధ సంస్థల పైనా ఈడీ కేసులు ఉన్నాయన్న యనమల వ్యాఖ్యలు ఇప్పుడు కలకలంగా మారాయి. ఇప్పటివరకు ఇంత సూటిగా.. స్పష్టంగా జగన్ మీద ఆరోపణాస్త్రాల్ని సంధించిన వారు లేరు. మరి.. ఈ వ్యాఖ్యలపై జగన్ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.