సీఎం జగన్ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ముప్పుతిప్పలు పెడుతోన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా వరుస లేఖలో జగన్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తోన్న రఘురామ తాజాగా ఏపీలో రైతు దినోత్సవం నాడు మరో లేఖ రాశారు. రైతు పేరును పార్టీ పేరులో పెట్టుకోవడం కాదని, రైతును గుండెల్లో పెట్టుకోవాలని జగన్ కు రఘురామ చురకలంటించారు.
ధాన్యం సేకరణ బకాయిల చెల్లింపులో జాప్యం విషయాన్ని రఘురామ తన లేఖలో ప్రస్తావించారు. రైతులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి రూ.1,619 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని, అయితే ధాన్యం సేకరణకు ఇప్పటికే కేంద్రం నిధులు విడుదల చేసిందని రఘురామ గుర్తు చేశారు.
ప్రభుత్వ తీరు వల్ల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని, దీనిని ఆసరాగా తీసుకున్న దళారులు… రైతులను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని, అదే రైతు దినోత్సవం నాడు రైతులకిచ్చే గౌరవమని ఆర్ఆర్ఆర్ అన్నారు. మరి, రఘురామ లేఖపై జగన్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.