దివంగత సీఎం వైఎస్ఆర్ తనయురాలు, సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీకి నేడు ముహూర్తం ఖరారైన సంగతి తెలిసిందే. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని జూబ్లీహిల్స్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో వైఎస్సార్ టీపీ ఆవిర్భావానికి షర్మిల రంగం సిద్ధం చేసుకున్నారు. పార్టీ పేరును ప్రకటించడంతో పాటు పార్టీ జెండానూ షర్మిల ఆవిష్కరించనున్నారు.
ఈ నేపథ్యంలోనే వైఎస్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద వైఎస్ సతీమణి విజయమ్మ, కుమార్తె వైఎస్ షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ నివాళులర్పించారు. తన తండ్రి సమాధిపై నూతన పార్టీ జెండాను వేసి షర్మిల ఆశీస్సులు తీసుకున్నారు. ఇడుపులపాయ నుంచి రోడ్డు మార్గాన కడప విమానాశ్రయం చేరుకున్న తర్వాత అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో షర్మిల తెలంగాణకు బయలుదేరి వెళ్లనున్నారు.
.
మరోవైపు, షర్మిల పర్యటన నేపథ్యంలో సీఎం జగన్ ఇడుపుల పాయలోని తన తండ్రి సమాధిని ఈ రోజు సాయంత్రం దర్శించుకోనున్నారు. తన తండ్రి వైఎస్ కు తొలిసారిగా సీఎం జగన్ సాయంత్రం వేళలో నివాళులర్పించనున్నారు. మరోవైపు, ఇలా చేయడం సాంప్రదాయాలు, ఆచారాలకు విరుద్ధమని పెద్దలు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
వాస్తవానికి గత ఏడాది అన్నా చెల్లెళ్లు ఇద్దరూ తల్లి విజయమ్మతో కలిసి వైఎస్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అయితే, ఈ ఏడాది షర్మిల సొంత కుంపటి పెట్టుకోవడంతో జగన్, షర్మిల మధ్య విభేదాలు వచ్చాయని ప్రచారం జరిగింది. ఉదయం సమయంలోనే జగన్ నివాళులు అర్పించాల్సి ఉండగా…. షర్మిళ అంగీకరించలేదని తెలుస్తోంది. సమయాల్లో మార్పు కోసం ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
షర్మిల అంగీకరించకపోవడంతో జగన్ తన పర్యటనను సాయంత్రానికి వాయిదా వేసుకున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రాజకీయలు వేరని, రక్త సంబంధం వేరని, కానీ, జగన్, షర్మిలలు వైఎస్ కు నివాళులర్పించే విషయంలో ఒక్కతాటిపైకి రాలేకపోవడం వారి మధ్య ఉన్న విభేదాలకు నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి. షర్మిల వెళ్లాకే జగన్ వచ్చేలా పర్యటన ఏర్పాట్లు చేయడం అన్నాచెల్లెళ్ల మధ్య గ్యాప్ కు సాక్షమని కామెంట్లు చేస్తున్నారు.