సాఫీగా సాగిపోతున్న వ్యవహారాన్ని కెలుక్కోవటం కొందరికి అలవాటు. ‘మా’ ఎన్నికలకు సంబంధించి గడిచిన కొద్ది రోజులుగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. ఇప్పటివరకు సాగిన ఆలోచనలకు భిన్నమైన ఆలోచనలు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ‘మా’ అసోసియేషన్ ను తెర వెనుక నుంచి నడిపే వారికి షాకిచ్చేందుకు కొత్త ప్లానింగ్ జరుగుతుందని చెబుతున్నారు. అధిపత్యపోరు నడుస్తున్న ‘మా’లో అసలుసిసలు రాజకీయం ఇక మొదలు కానున్నట్లుగా సమాచారం. ఒకరి తర్వాత ఒకరు పోటాపోటీగా ఎన్నికల బరిలోకి దిగేందుకు పేర్లు ప్రకటించిన వైనం తెలిసిందే.
దీంతో మామూలుగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. ప్రశ్నించే గొంతులతో ఎన్నికల బరిలో దిగనున్నామని.. తనను సైతం ప్రశ్నించేలా తమ కార్యవర్గం ఉంటుందని ప్రకాశ్ రాజ్ నిర్వహించిన మీడియా భేటీలో ఆయనే స్వయంగా ప్రకటించటం తెలిసిందే. అదే భేటీలో..ఈ మధ్య కాలంలో ‘‘మా’’ ‘మసకబారింది’ అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు వాతావరణాన్ని వేడెక్కేలా చేయటమే కాదు.. పలువురి మనసుల్ని బాధించాయని చెబుతున్నారు.
ఇప్పటివరకు ‘మా’ ఎన్నికల సందర్భంగా విమర్శలు చేసుకోవటమే తప్పించి.. అధికారం నుంచి వైదొలిగే బాడీ మీద విమర్శలు చేసే సంప్రదాయం లేదని.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న వారికి చెక్ పెట్టేందుకు వీలుగా కొత్త ప్లాన్ రెఢీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ‘మా’కు పరిచయం లేని లిటిగేషన్ ను సరికొత్తగా చూపించటమే కాదు.. ఎన్నికల నిర్వహణ ఎంత క్లిష్టమన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలన్న పట్టుదలతో కొందరు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే.. రానున్న రోజుల్లో ‘మా’ ఎన్నికల్లో కీలక భూమిక పోషించటం ఖాయమంటున్నారు. మరేం జరుగుతుందో కాలమే డిసైడ్ చేయాలి.