తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన జలజగడాలపై బీజేపీలోకి ఫిరాయించిన టీడీపీ ఎంపి టీజీ వెంకటేష్ కరెక్టు పాయింట్ రైజ్ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో నీటి పంపకాలపై బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ కేటాయింపులను గుర్తించమని కేసీయార్ వ్యాఖ్యలపై టీజీ మండిపడ్డారు.
ట్రైబ్యునల్ కేటాయింపులను కేసీయార్ గుర్తించకపోతే రాష్ట్ర విభజనను తాము అంగీకరించేదిలేదంటు గట్టిగా సమాధానం చెప్పారు. నిజమే కదా రాష్ట్ర విభజన, నీటి వాటా ఒకే ఒప్పందం ద్వారా జరిగినపుడు కేసీఆర్ ఒకదాన్ని తప్పు పడితే మొత్తం తప్పే అవుతుంది కదా.
నిజానికి రాష్ట్ర విభజన జరిగిన తీరుపై ఇప్పటికే అనేకమంది అనేక విధాలుగా అసంతృప్తులు వ్యక్తంచేస్తున్నారు. విభజన తీరుపై సుప్రింకోర్టులో మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ కేసు కూడా వేశారు. రాష్ట్రాల విభజనపై లోక్ సభలో అసలు ఓటింగే జరగలేదని, సరైన ప్రొసీజర్లను లోక్ సభ స్పీకర్ ఫాలో అవలేదని ఉండవల్లి ఇపుడు కూడా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపధ్యంలోనే రాష్ట్ర విభజన జరిగిపోయిందని చెప్పి తెలుగురాష్ట్రాన్ని విడగొట్టేశారు. దాన్ని అడ్డంపెట్టుకుని కేసీయార్ ఏనాడూ విభజన చట్టాన్ని గౌరవించిందిలేదు. తమకు ప్లస్ అయినపుడల్లా విభజన చట్టాన్ని ప్రస్తావిస్తున్న కేసీయార్ సమస్యలు వచ్చినపుడు మాత్రం విభజన చట్టాన్ని లెక్కచేయటమే కాకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు.
ఇపుడిదే విషయాన్ని టీజీ ప్రస్తావించారు. నీటి కేటాయింపులను కేసీయార్ గుర్తించనపుడు రాష్ట్ర విభజనను తాము మాత్రం ఎందుకు అంగీకరించాలని ప్రశ్నించారు. ఇదే విషయమై పార్టీలకు అతీతంగా నేతలంతా ఏకమవ్వాలని పిలుపిచ్చారు. రాయలసీమ ప్రాజెక్టులపై రెండు మూడు రోజుల్లో సమావేశం అవబోతున్నట్లు చెప్పారు. ఏపికి న్యాయం జరిగేలా బీజేపీ ప్రయత్నిస్తుందని టీజీ చెప్పటం గమనార్హం.