2019లో ఏపీ సీఎంగా జగన్ , తెలంగాణ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసింది మొదలు ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలున్నాయన్న సంకేతాలు పంపుతూ వచ్చారు. ఒకరికొకరం సహకరించుకుంటూ ముందుకు పోతామని ఇద్దరు సీఎంలు చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే, ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం నేపథ్యంలో జగన్, కేసీఆర్ ల మధ్య గ్యాప్ వచ్చిందని ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి తగ్గట్టు జల జగడం నేపథ్యంలో తాజాగా జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఇద్దరు సీఎంల మధ్య వాడీ వేడీ చర్చ జరిగిందని….మధ్యలో కేంద్ర మంత్రి షెకావత్ సర్ది చెప్పారని పుకార్లు వస్తున్నాయి.
అయితే, ఏపీ, తెలంగాణలు కొత్తగా నిర్మించాలనుకుంటున్న ప్రాజెక్టుల డీపీఆర్ రిపోర్టులు సంబంధిత నదీ బోర్డులకు అందించాలని, ఆ తర్వాత అపెక్స్ కౌన్సిల్ ఓ నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి షెకావత్ తెలిపారు. డీపీఆర్ రిపోర్టులు అందించేందుకు, కేఆర్ఎంబీ బోర్డు తరలించేందుకు ఇద్దరు సీఎంలు అంగీకరించారని కూడా చెప్పారు. నదీ జలాల పంపిణీకి సంబంధించి సుప్రీంలో ఉన్న కేసును ఉపసంహరించుకునేందుకు కేసీఆర్ అంగీకరించారన్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే…ఈ నీటి వివాదంపై ఇద్దరు సీఎంల మధ్య సంధి కుదిర్చానని…వారిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారని షెకావత్ తేల్చేశారు.
అయితే, కేసీఆర్, జగన్ లు జల జగడంపై చాలాకాలంగా ఏకాభిప్రాయంతోనే ఉన్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గతంలో తెలంగాణకు రావాల్సిన 575 టీఎంసీలకు బదులు 299 టీఎంసీలు తీసుకునేందుకు కేసీఆర్ అంగీకరించారని, అపుడే ఈ ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉందని స్పష్టమైందని తెలంగాణ విపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
వాస్తవానికి ఎన్నికల ముందు నుంచి జగన్ ను గైడ్ చేస్తున్న కేసీఆర్ కు చెప్పకుండా జగన్ పోతిరెడ్డిపాడు వ్యవహారాన్ని తెరపైకి తీసుకురారని అనుకుంటున్నారు. ఇక, ఆల్రెడీ 80 శాతం పూర్తయిన పోలవరం, 90 శాతం పూర్తయిన హంద్రీ నీవాలను జగన్ పూర్తి చేయకుండా…కొత్త ప్రాజెక్టులంటూ కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ తో దోస్తీ ఉందని చెబుతున్న జగన్ నీటి కోసం కుస్తీ పడుతున్నానంటే జనం నమ్మరు. కాబట్టే…నీళ్ల కోసం జరుగుతున్నఈ లొల్లి ఢిల్లీ చేరిందన్న ప్రచారం జరుగుతోంది.
ఈ ఇద్దరు సీఎంలు సన్నిహితంగా ఉంటారన్న విషయం తెలిసిన కేంద్రం…ఏదో పెద్దమనిషి తరహాలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి మమ..అనిపించుకుందనన వాదనను వినిపిస్తోంది. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఏం జరిగిందన్న విషయంలో షెకావత్…జగన్….కేసీఆర్ లు ముగ్గురికి ఎవరి వెర్షన్లు వారికుంటాయి. కాబట్టి…లోగుట్టు పెరుమాళ్లుకెరుక అన్న రీతిలో అపెక్స్ మీటింగ్ లో ఏం జరిగిందన్న విషయం ఆ ముగ్గురికే ఎరుక అన్న టాక్ సోషల్ మీడియాలో వస్తోంది.
పైన మినిస్ట్రీ చెప్పింది అబద్ధం అన్నట్టుంది కింది వీడియలో కేసీఆర్ వ్యాఖ్యలు