కరోనా మొదటి వేవ్ తో పోలిస్తే.. సెకండ్ వేవ్ ఎంత సీరియస్ గా అటాక్ అయ్యిందో తెలిసిందే. ఫస్ట్ వేవ్ ప్రభావం పెద్దగా లేని నేపథ్యంలో సెకండ్ వేవ్ తీవ్రత అంతగా ఉండకపోవచ్చన్న అంచనాలతో అటు ప్రభుత్వాలు..ఇటు ప్రజలు కాస్తంత ఉదాసీనంగా వ్యవహరించారు.
అదే కోట్లాది మందిని ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసింది. దేశంలోని మెజార్టీ రాష్ట్రాల్ని ఒక ఊపు ఊపేసిన సెకండ్ వేవ్.. జూన్ కు వచ్చేసరికి కాస్తంత తగ్గుముఖం పట్టగా.. ఇప్పుడు మరింతగా కేసులు తగ్గటంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే..తెలంగాణలో కేసుల తీవ్రత బాగా తగ్గగా.. ఏపీలో మాత్రం ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో.. హమ్మయ్య అన్న రిలాక్స్ అవుతున్న ప్రజలకు దడ పుట్టే మాటల్ని చెప్పుకొచ్చింది దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్ బీఐ.
మూడో వేవ్ మీద మాటలు వినిపిస్తున్నప్పటికి.. సరిగ్గా ఎప్పుడు మొదలవుతుంది? పీక్స్ కు ఎప్పుడు చేరుకుంటుంది? లాంటి అంచనాలు పెద్దగా బయటకు రాలేదు. ఆ లోటును తీర్చేలా ఎస్ బీఐ నివేదికలోని వివరాలు ఉన్నాయని చెబుతున్నారు. మే మొదటి వారంలో రోజుకు నాలుగు లక్షలకు పైచిలుకు కేసులు నమోదు కావటం తెలిసిందే. మే చివరకు వచ్చేసరికి రెండు లక్షల నుంచి లక్షన్నర వరకు కేసుల సంఖ్య తగ్గింది.
ఈ నెల రెండో వారానికి దేశ వ్యాప్తంగా రోజువారీ కొత్తకేసుల సంఖ్య 10వేల కంటే తక్కువకు నమోదయ్యే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఇదంతా బాగానే ఉన్నా.. ఇలాంటి మంచి రోజులు మరికొన్ని మాత్రమేనని.. ఆగస్టులో మళ్లీ థర్డ్ వేవ్ షురూ కావొచ్చన్న మాట వినిపిస్తోంది. ఇది నిజమేనని చెబుతోంది ఎస్ బీఐ తాజా నివేదిక.
దీని ప్రకారం ఆగస్టు రెండో వారం తర్వాత నుంచి కేసుల తీవ్రత మళ్లీ పెరిగే వీలుందని చెబుతున్నారు. రెండో దశతో పోలిస్తే.. మూడో దశలో గరిష్ఠ కేసులు సగటున రెండింతలు.. లేదంటే 1.7రెట్లు అధికంగా నమోదయ్యేఅవకాశం ఉందని అంతర్జాతీయ గణాంకాలు స్పష్టం చేస్తున్నట్లు చెబుతున్నారు.
కొవిడ్ రెండో దశతో పోలిస్తే.. మూడో దశ తీవ్రంగా ఉండే వీలుందని.. అయితే మరణాలు మాత్రం తక్కువగా ఉంటాయన్న అంచనా వినిపిస్తోంది. ఎస్ బీఐ అంచనా ప్రకారం కేసుల నమోదు ఆగస్టు రెండో వారం నుంచి మొదలైతే.. దాని ప్రభావం తక్కువలో తక్కువ 30 – 50 రోజుల మధ్య ఉంటుంది. అంటే.. సెప్టెంబరు చివరి వరకు కానీ.. అక్టోబరు మొదటి వారం వరకు తీవ్రత ఎక్కువగా ఉండే వీలుంది.
మళ్లీ ఇప్పటి పరిస్థితులకు రావాలంటే తక్కువలో తక్కువ క్యాలెండర్లో నవంబరును చూడాల్సి ఉంటుందన్న మాట వినిపిస్తోంది చూస్తుంటే.. కరోనా కారణంగా 2020 మాత్రమే కాదు 2021 కూడా పూర్తిగా నాశనమైపోయినట్లుగా చెప్పక తప్పదు.