ఏపీలో ఓ పక్క కరోనా కట్టడి…మరో వైపు థర్డ్ వేవ్ ముప్పు…ఇంకో పక్క వ్యాక్సినేషన్…మరోవైపు రద్దయిన పరిషత్ ఎన్నికలు మళ్లీ జరపాల్సి వస్తుందా లేద అన్న టెన్షన్…అధికార పార్టీ నేతలకు ఇలా తలబొప్పి కట్టే సమస్యలు చాలా ఉన్నాయి. అయితే, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రస్తుతం వీటి గురించి ఆలోచించడం లేదట. ఉన్న మంత్రి పదవి ఉంటుందా? ఊడుతుందా? అని మంత్రులు ఆలోచిస్తుంటే…ఖాళీ అయ్యే బెర్తుల్లో తమకు చాన్స్ వస్తుందా అని ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారట.
ఇక, తన మంత్రి పదవి ఉంచాలంటూ డిప్యూటీ సీఎం ఒకరు ఏకంగా జగన్ కాళ్ల మీద పడ్డారని రాజకీయ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాళ్ల మీద పడినప్పటికీ, ఆ సీనియర్ నేతను జగన్ కనికరిస్తారా లేదా అన్న చర్చ జరుగుతోందట. మంత్రులకు జగన్ విధించిన రెండున్నరేళ్ల డెడ్లైన్ దగ్గర పడుతోండడంతో వారికి టెన్షన్ పట్టుకుందట. దీంతో, తనను కొనసాగించాలంటూ ఓ మంత్రి ఏకంగా జగన్ ముందు సాష్టాంగపడ్డారని టాక్ వస్తోంది.
నిజాయితీగా పేదవారి కోసం పనిచేశానని, తాను ఒక్క రూపాయి అవినీతికి పాల్పడలేదని అడిగిన వారికి, అడగని వారికి, మీడియా సమావేశాల్లో ఒకే పాట పాడుతున్నారట ఆ మంత్రి. గతంలో ఆ మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, సొంత జిల్లా ఎమ్మెల్యేలతో విభేదాలు వంటి పలు కారణాల నేపథ్యంలో ఆయనపై వేటు తప్పదని, అందుకే ఆయన అభద్రతా భావంలో ఉన్నారని అనుకుంటున్నారని తెలుస్తోంది.