ఏపీ సీఎం జగన్ సొంత బాబాయి.. మాజీ ఎంపీ.. వైవీ సుబ్బారెడ్డి అలిగారు. ఏకంగా.. బెంగళూరుకు వెళ్లి కూర్చున్నట్టు సమా చారం. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సమయం ముగిసిపోవడంతో తిరిగి మరికొంత కాలం బోర్డు కాలం పెంచు తారని పార్టీ లో చర్చ సాగింది. అయితే.. గతంలోనూ ఇదే జరిగి.. వివాదం అయిన నేపథ్యంతోపాటు.. రెడ్డి సామాజిక వర్గానికే జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారనే వాదన బలంగా వినిపించడంతో వెంటనే బోర్డును రద్దు చేశారు.
ఈ పరిణామం సహజంగానే.. వైవీకి ఆగ్రహం తెప్పిం చింది. ఎందుకంటే.. బోర్డు కాల పరిమితి ముగియడానికి నెల రోజుల ముందునుంచి ఆయన రెండు సార్లు.. జగన్కు టైం పెంచాలని విన్నవించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. దీనికి జగన్ ససేమిరా అన్నారు. బోర్డు రద్దయింది.
ఇంత వరకు అందరికీ తెలిసిందే.కానీ, ఇప్పుడు వైసీపీలో అత్యంత కీలకమైన నేతల మధ్య సాగుతున్న చర్చ ఏంటంటే.. వైవీ.. అలిగారని.. బోర్డును రద్దు చేయడం వెనుక.. ఓ మంత్రి హస్తం ఉందని.. ఆయన భావిస్తున్నారని.. అంటున్నారు.
సదరు మంత్రి జగన్కు అత్యంత సన్నిహితుడు కావడం.. ఆయన సామాజిక వర్గానికే చెందిన నాయకుడు కావడంతో ఇది జరిగిందని చర్చించుకుంటున్నారు. అంటే.. బోర్డు రద్దు కోసం.. సదరు మంత్రి ఎదురు చూశారని వైవీ భావిస్తున్నారు. వాస్తవంగా అయితే.. ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో వైవీకి విభేదాలు ఉన్నాయి.
గతంలో ఒంగోలు ఎంపీగా వైవీ ఉన్నదగ్గర నుంచి కూడా వీరిమధ్య విభేదాలు కొనసాగి.. జగన్ దగ్గర పంచాయతీలు కూడా నడిచాయి. చివరాఖరుకు.. జగన్ బాలినేని కి ప్రాధాన్యం ఇచ్చారని పార్టీలో చర్చించుకున్నారు కూడా!
అయితే.. ఇప్పుడు.. ఈ మంత్రే..వైవీకి మరోసారి ఇబ్బందిగా మారారా? అంటే.. కాదని తెలుస్తోంది. గతంలో ఎంపీగా ఉన్న వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడై.. ప్రస్తుతం రిటైర్మెంట్లో ఉన్న నాయకుడి కోసం.. జగన్ బోర్డును టైం అవగానే రద్దు చేశారని ఓ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే టీటీడీ బోర్డు రద్దు కాగానే.. వైవీ సీఎం జగన్కు మొహం కూడా చూపించకుం డానే బెంగళూరుకు వెళ్లిపోయారని చర్చ సాగుతోంది.
ఇదిలావుంటే.. గత ఎన్నికల సమయంలోనూ తనకు ఒంగోలు టికెట్ ఇవ్వలేదని.. వైవీ అలిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అప్పుడు కూడా ఆయన బెంగళూరుకు వెళ్లిపోయారు. చివరకు జగన్ ఫోన్ చేసి రప్పించారు. మరి ఇప్పుడు కూడా స్వయంగా జగనే రంగంలోకి దిగుతారా? లేక ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది.