అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు…ప్రపంచాన్ని పిడికిలిలో బంధించినట్టే. స్మార్ట్ ఫోన్ లో చాటింగ్ కోసం ఎన్నో యాప్ లు అందుబాటులో ఉన్నప్పటికీ…వాట్సాప్ వాటన్నింటిలో ప్రత్యేకంగా నిలుస్తుందే. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది యూజర్లున్న ఈ యాప్…ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ తో అలరించేందుకు సిద్ధమైంది.
ఇకపై వాట్సాప్ లో ఎంచుకున్న ఫొటోలు చూడగానే మాయం కానున్నాయి. అటువంటి ఫీచర్ ను వాట్సాప్ తీసుకొచ్చింది. ఎవరికైనా మనం ఫొటోలను పంపగానే…వాళ్లు ఆ ఫొటోలు చూసిన తర్వాత చాట్ నుంచి బయటకు రాగానే ఆ ఫొటోలు మాయమైపోతాయి. మనం పంపాలనుకున్న ఫొటోలను గ్యాలరీ నుంచి ఎప్పటిలాగే సెలెక్ట్ చేసుకోవాలి. కానీ, సెండ్ చేసే ముందు పక్కనున్న క్లాక్ సింబల్ పై క్లిక్ చేయాలి.
అలా క్లిక్ చేసిన ఫొటోలు ఒకసారి చూసిన తర్వాత ఆటోమేటిక్ గా మాయమైపోతాయి. ఈ వాట్సాప్ ఫీచర్.. ఇన్స్టాగ్రామ్లో కనిపించే ‘ఎక్స్పైరింగ్ మీడియా’ ఫీచర్లా ఉందని టెక్ నిపుణులు అంటున్నారు. ‘వ్యూ వన్స్’ అనే ఈ ఫీచర్ ను బేటా టెస్టర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్. త్వరలోనే యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.