టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పజెప్పడంతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. రేవంత్ నియామకంపై కోమటిరెడ్డితోసహా వీహెచ్ వంటిక కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నప్పటికీ…చాలామంది నేతలు రేవంత్ వెంట అడుగులు వేసేందుకు క్యూ కడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు రేవంత్ వెంటన నడిచేందుకు సిద్ధమవుతున్నారు.
అయితే, టీపీసీసీ అధ్యక్షుడిగా తన పేరు ప్రకటించిన వెంటనే…తనపై అసమ్మతి ఉన్న నేతల వ్యవహారాన్ని పక్కనబెట్టిన రేవంత్…భవిష్యత్ కార్యచరణపై ఫోకస్ చేశారట. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా రేవంత్ తనదైన ప్రణాళికలతో ముందుకు వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే త్వరలో రేవంత్ తెలంగాణలోని 33 జిల్లాలను చుట్టేసేలా సుదీర్ఘ పాదయాత్ర చేయబోతున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పై నమ్మకాన్ని తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా అలంపూర్ టు అదిలాబాద్ పాదయాత్ర చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరో పది రోజుల్లో స్పష్టమైన ప్రకటన, రూట్ మ్యాప్ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, టీసీసీసీ అధ్యక్షుడు కాకముందే రేవంత్ పాదయాత్ర చేయాలని సంకల్పించిన సంగతి తెలిసిందే.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కన్నా ముందుగానే రంగంలోకి దిగాలని రేవంత్ భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్, చంద్రబాబు,జగన్ లకు అధికారం కట్టబెట్టిన సక్సెస్ ఫుల్ పాదయాత్ర ఫార్ములా రేవంత్ కు వర్కవుట్ అవుతుందో లేదో వేచి చూడాలి.