ఈ టెక్ జమానాలో ఇంటర్నెట్, సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయాయి. అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు…ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్టే. ఆధునిక సాంకేతికతో అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకొని…సరుకులు, మెడిసిన్, ఫుడ్ వంటివి చిటికెలో హోమ్ డెలివరీ చేస్తున్నారు. అయితే, వినాశకాలే విపరీత బుద్ధి అని….ఏదో స్విగ్గీలో ఫుడ్ డెలివరీ చేస్తామన్నంత ఈజీగా…గన్ లు అమ్ముతాం…అవసరమైతే మర్డర్లు, కిడ్నాప్ లు చేస్తామంటూ యూట్యూబ్ లో ప్రకటనిచ్చాడో ప్రబుద్ధుడు.
ఇచ్చినవాడికి బుద్ధిలేకపోగా…ఆ ప్రకటన చూసి తన భార్య, అత్తను మర్డర్ చేసిన అల్లుడికీ బుద్ధి లేకపోవడంతో, ఈ ప్రబుద్ధులంతా ఇపుడు ఊచలు లెక్కబెడుతున్నారు. మంచిర్యాల బృందావనం కాలనీలో తల్లి పూదరి విజయలక్ష్మీ, కుమార్తె రవీనా నివాసం ఉంటున్నారు. కట్నం కోసం రవీనాను అల్లుడు అరుణ్ వేధించడంతో ఈమె పుట్టింటికి వచ్చేసింది. అప్పటికీ రవీనా గర్భవతి కావడంతో…తల్లి విజయలక్ష్మీ అబార్షన్ చేయించింది. దీంతో ఆ ఇద్దరిపై పగ పెంచుకున్న అరుణ్ వారిని హతమార్చాలనుకున్నాడు.
ఇదే సమయంలో సుపారీ కిల్లర్ విజయవాడ పేరుతో యూట్యూబ్ లో ఓ చానెల్ కనిపించింది. సుపారీ తీసుకుని హత్యలు, కిడ్నాప్ లు చేస్తామని ఓ ఇంటర్నేషనల్ నంబర్ ఉండడంతో దానిని అరుణ్ వాట్సాప్ లో సంప్రదించాడు. ఆ చానెల్ నిర్వహిస్తున్న బిట్టు…తెనాలికి చెందిన సుబ్బుతో కలిసి వారి మర్డర్ కు ప్లాన్ వేశాడు. వారికి అరుణ్ కూడా జత కూడడంతో ముగ్గురు కలిసి రవీనా, విజయలక్ష్మిలను వారి ఇంటికే వెళ్లి హత్య చేశారు.
వారి శరీరంపై నగలు దోచుకొని, ఇంట్లో ఉన్న రూ.4లక్షల నగదుతో పరారయ్యారు. చివరికి, వారి పాపం పండడంతో పోలీసులు వారిని పట్టుకొని విచారణ జరుపగా…ఈ ఆన్ లైన్ మర్డర్ బిజినెస్ వ్యవహారం గుట్టు రట్టయింది. అయితే, సుబ్బు కూడా తన ప్రేయసిని చంపేందుకు బిట్టుతో జత కట్టి చివరకు ఆ గ్యాంగ్ లో చేరి కటకటాల పాలయ్యాడు.