ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కొవిడ్ కు చెక్ పెట్టే టీకాలకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా చాలానే ఉన్నప్పటికి.. చాలామందికి ఫైజర్.. మోడెర్నా టీకాలు ఎప్పుడెప్పుడు వస్తాయా? అన్నది ప్రశ్నగా మారింది. తాజాగా దీనికి సమాధానం వచ్చేసింది. మోస్ట్ అవైటింగ్ టీకాగా పేరున్న మోడెర్నాకు భారత ప్రభుత్వం ఓకే చెప్పేసింది. అత్యవసర వినియోగానికి అనుమతిని ఇచ్చేసింది. తాజాగా భారత ఔషధ నియంత్రణ సంస్థ మోడెర్నా టీకాను భారత్ లో వినియోగించటానికి వీలుగా అనుమతులు ఇస్తూ ఆదేశాల్ని జారీ చేసింది.
దీంతో.. దేశీయంగా లభించే నాలుగో టీకాగా మోడెర్నా నిలవనుంది. ఇప్పటికే సీరం ‘కొవాగ్జిన్’.. భారత్ బయోటెక్ వారి ‘కొవాగ్జిన్’.. రష్యాకు చెందిన ‘స్పుత్నిక్’.. ఇప్పుడు మెడెర్నా. స్పుత్నిక్ టీకాను ప్రఖ్యాత ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ మార్కెట్లోకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక.. మోడెర్నా టీకాను దేశీయ ఫార్మా దిగ్గజం సిప్లా ద్వారా భారత్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు.
ముంబయికి చెందిన ఈ ఫార్మా కంపెనీ ఎట్టకేలకు మోడెర్నాను భారత్ కు తీసుకురావటానికి తగిన అనుమతుల్ని తాజాగా పొందింది. మరోవైపు ఫైజర్.. జే అండ్ జే వ్యాక్సిన్లను తీసుకురావటానికి చర్చలు జరుగుతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. మోడెర్నాకు భారత్ లో ఎలాంటి బ్రిడ్జి ట్రయల్స్ నిర్వహించకుండానే అనుమతులు మంజూరు చేశారు. ప్రస్తుతం టీకా కొరత వెంటాడుతుండటంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఇప్పటికే ఈ వ్యాక్సిన్ను అమెరికా.. బ్రిటన్.. జపాన్ లకు చెందిన సంస్థలు నాణ్యతతో పాటు.. పని తీరును పరిశీలించి ఓకే చెప్పేసిన నేపథ్యంలో.. మోడెర్నాకు భారత సర్కారు ఓకే చెప్పేసింది. అయితే.. ఇది మార్కెట్లోకి ఎప్పుడు అందబాటులోకి వస్తుందన్న విషయంపై మాత్రం స్పష్టత రాలేదు.