ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్… తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్-5 మొదలు కాబోతోంది. అయితే, సీజన్-4కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాగార్జున….ఐదో సీజన్ కు హోస్ట్ గా ఉండకపోవచ్చని టాక్ వస్తోంది. ఈ క్రమంలోనే మరో స్టార్ హీరో సీజన్-5కు హోస్ట్ గా వ్యవహరించబోతున్నారన్న వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.
బిగ్ బాస్ తొలి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా షోను మరో రేంజ్ కు తీసుకువెళ్లాడు. తెలుగులో అంత సక్సెస్ అవుతుందో కాదో అనుకున్న ఆ షోను తారక్ ఒంటి చేత్తో డీల్ చేసి వ్యాఖ్యాతగానూ తాను తక్కువేం కాదని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక, తారక్ నుంచి రెండో సీజన్ పగ్గాలను అందుకున్న నేచురల్ స్టార్ నాని కూడా తనదైన శైలిలో షోను లాగించేశాడు. ఇక, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున తన చరిష్మాతో మూడు, నాలుగు సీజన్స్ ను అవలీలగా ముగించేసి బిగ్ బాస్ పై క్రేజ్ ను మరింత పెంచేశాడు.
అదే ఊపును కొనసాగిస్తూ ఈ సారి కూడా ఆయనే హోస్ట్ అని అంతా అనుకుంటున్నారు. కానీ, బిగ్ బాస్ సీజన్ 5 హోస్ట్ గా దగ్గుబాటి రానా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఆల్రెడీ ‘నెంబర్ వన్ యారీ’ షోను సక్సెస్ ఫుల్ గా నడిపించిన రానా….బిగ్ బాస్ షోను రక్తి కట్టిస్తాడనే నమ్మకం షో నిర్వాహకులకుందని తెలుస్తోంది. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉండే రానా…షోకు హోస్ట్ గా యాప్ట్ అవుతాడని అనుకుంటున్నారట. మరి, ఈ పుకార్లలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదు.