ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకు కట్టి ఇస్తున్న ఇళ్ల విషయంలో ఘనంగా ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధుల సహకారం అందిస్తుండగా.. వాటికి ‘జగనన్న ఇళ్లు’గా నామకరణం చేసి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తోందంటూ జగన్ సర్కారుపై విమర్శలున్నాయి.
పైగా ఈ ఇళ్లు మరీ చిన్నవిగా అగ్గిపెట్టెల్లా ఉంటున్నాయని.. నివాసానికి అంత అనువుగా లేవనే అభ్యంతరాలూ వ్యక్తమవుతున్నాయి. కానీ ప్రభుత్వం ఈ విషయంలో పెద్దగా చలిస్తున్నట్లుగా కనిపించడం లేదు.
కాగా ఇప్పుడు ఒక వైకాపా ఎమ్మెల్యేనే జగనన్న ఇళ్ల విషయంలో అసంతృప్తిని వెళ్లగక్కడం గమనార్హం. జగన్ అభిమానిగా పేరున్న నెల్లూరు జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఓ అధికారిక సమావేశంలో జగనన్న ఇళ్ల గురించి చేసిన వ్యాఖ్యలు సోష్ల మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రభుత్వం కట్టిస్తున్న ఇళ్లలో బెడ్ రూంలు మరీ చిన్నవిగా ఉంటున్నాయని.. అందులో కాస్త పెద్ద సైజున్న మంచం వేస్తే పట్టే పరిస్థితి లేదని ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. రెడీ మేడ్ మంచాలేవీ ఈ బెడ్ రూంల్లో పట్టవని.. గదికి తగ్గట్లు కొలతలు తీసుకుని మంచం తయారు చేసుకోవాల్సిందే అని ఆయనన్నారు. ఇంటి లోపల బాత్ రూం లేకుండా.. దాన్ని బయట పెట్టించి బెడ్ రూంల సైజు పెంచాలని ప్రసన్న కుమార్ కోరారు.
మంత్రి అనిల్ కుమార్ నియోజకవర్గంలో అయితే బెడ్ రూం మరీ మరీ ఆరు అంకణాల్లో (24 గజాలు) కట్టిస్తున్నారని.. అవి మరీ చిన్నవి అవుతాయని.. కొత్త జంటలు శోభనం చేసుకోవాలనుకుంటే హాల్లో చేసుకుని బెడ్ రూంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని ప్రసన్నకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు మంత్రి అనిల్, అధికారుల సమక్షంలో వ్యాఖ్యానించడం గమనార్హం. ఆయనన్న మాటతో సమావేశం గొల్లుమంది. జగనన్న ఇల్ల డొల్లతనం ఇదంటూ ఈ వీడియోను టీడీపీ, జనసేన మద్దతుదారులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.