జూన్ 26, 2021
శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి,
ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్.
విషయం: జీవో ఎంఎస్ నెం 146, తేదీ 23.06.2021 విడుదల: ఆంధ్రప్రదేశ్ ఛారిటబుల్ అండ్ హిందూ రెలిజియస్ ఇన్ స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్టం 1987 లోని 137 సెక్షన్ ను ఉపయోగించుకుని చట్టాన్ని అపహాస్యం చేసే విధంగా తిరుమలలో స్పెసిఫైడ్ అథారిటీ ని ఏర్పాటు చేస్తూ కొత్త వివాదానికి తెర తీయడం.
సూచిక: నవ ప్రభుత్వ కర్తవ్యాలు లేఖ 7
ముఖ్యమంత్రి గారూ,
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పదవీ కాలం ముగిసినందున ఆంధ్రప్రదేశ్ ఛారిటబుల్ అండ్ హిందూ రెలిజియస్ ఇన్ స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్టం 1987 లోని 137 సెక్షన్ ప్రకారం మీరు జీవో ఎంఎస్ నెం 146, తేదీ 23.06.2021 విడుదల చేసి స్పెసిఫైడ్ అథారిటీ ని ఏర్పాటు చేయడంపై రాష్ట్ర ప్రజానీకం తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే ఇలాంటి అవాంఛనీయమైన జీవో విడుదల చేసి స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేస్తున్నారని భక్తులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.వివిధ రంగాలకు చెందిన 37 మంది ప్రముఖులు సభ్యులుగా తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్టు బోర్డును మీరు రెండు సంవత్సరాల కాలపరిమితికి నియమించారు. ఆ కాలపరిమితి పూర్తి కావడంతో మీరు కొత్త బోర్డును నియమించాల్సి ఉంది. అలా కాకుండా మీరు స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఛారిటబుల్ అండ్ హిందూ రెలిజియస్ ఇన్ స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్టం 1987 లోని 137 సెక్షన్ ను ఉపయోగించి స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేయడం ఎట్టి పరిస్థితుల్లో వాంఛనీయం కాదు. ఈ అవాంఛనీయ నిర్ణయం హిందూ ధర్మాన్ని ఆచరించే పలువురి నమ్మకాలను తీవ్రంగా గాయపరుస్తున్నదని ఈ కింద చూపిన కారణాల ప్రాతిపదికన చెప్పక తప్పదు.
1.మీరు తీసుకున్న ఈ నిర్ణయంతో మీ పాలనలో మీ కింద పని చేసే అధికారి అయిన ముఖ్య కార్యనిర్వహణాధికారి ఇక నుంచి తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్టుబోర్డు చైర్మన్ గానూ, మరో ప్రభుత్వ అధికారి అయిన అదనపు కార్యనిర్వహణాధికారి ఈ స్పెసిఫైడ్ అథారిటీకి కన్వీనర్ గానూ ఉంటారు. ట్రస్టు బోర్డు సభ్యులుగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉంటే తదుపరి మీరు ఈ అధికారుల ద్వారా తీసుకోబోయే నిర్ణయాలను అడ్డుకుంటారని మీరు ఈ పని చేసినట్లుగా ప్రజలలో పూర్తి స్థాయి అపోహ ఉంది.
2.వివిధ రంగాల నుంచి ప్రముఖులు అయిన 37 మంది సభ్యులుగా ఉండటం వల్ల ట్రస్టు బోర్డు తీసుకునే నిర్ణయాలను పలు రకాల కోణాల్లో చర్చించి అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవడానికి వీలుకలుగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా కాకుండా ఇద్దరే సభ్యులతో స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేస్తే వారు ఏమీ చర్చించే వీలు ఉండదు.
3.మన ప్రభుత్వం జారీ చేసిన జీవో ను పరిశీలిస్తే తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్టు బోర్డు కు ఉన్న అన్ని అధికారాలను కూడా ఈ స్పెసిఫైడ్ అథారిటీకి బదిలీ చేసినట్లు అర్ధం అవుతుంది. మరింత వివరంగా చెప్పాలంటే
‘‘ తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్టు బోర్డుకు ఉన్న అన్ని అధికారాలు, అన్ని బాధ్యతలు కూడా ఈ స్పెసిఫైడ్ అథారిటీకి తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకు దఖలు పరచడమైనది’’ అని మీరు విడుదల చేసిన జీవోలో విస్పష్టంగా పేర్కొన్నారు.
ఈ కారణంగా చట్టంలోని సెక్షన్ 97బి (2) ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్టు బోర్డుకు దఖలు పడ్డ దేవస్థానం ఆస్తుల పర్యవేక్షణ బాధ్యత కూడా పలువురు సభ్యులు ఉన్న బోర్డు నుంచి కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్న ఈ స్పెసిఫైడ్ అథారిటీకి దక్కుతాయి.
4.చట్టంలోని సెక్షన్ 111(2) ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన నిధులను ఖర్చు చేసే పూర్తి అధికారాలు కూడా మీరు విడుదల చేసిన జీవో ప్రకారం కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్న ఈ స్పెసిఫైడ్ అథారిటీకి దఖలు పడుతుంది.
5.తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్టు బోర్డులో ఇబ్బడి ముబ్బడిగా సభ్యుల సంఖ్యను పెంచేసి మొత్తం 37 మందిని వరకూ నామినేట్ చేసిన మీరు, ఏ కారణం చేతనైతేనేమి దాన్ని స్పెసిఫైడ్ అథారిటీ పేరుతో కేవలం ఇద్దరు సభ్యులకు కుదించడంపై మన ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రజలు అందరూ మరీ ముఖ్యంగా భక్తులు అందరూ శంకిస్తున్నారు. ఈ కొత్త స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటుపై ఎవరికి నమ్మకం కలగడం లేదు.
6.సాధారణంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి గానీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గానీ ఇలాంటి స్పెసిఫైడ్ అథారిటీలో సభ్యులుగా ఉంటారు. అలాంటి సాంప్రదాయాన్ని కూడా మీరు ప్రస్తుతం పట్టించుకునే స్థితిలో ఉన్నట్లు కనిపించడం లేదని భక్తులు భావిస్తున్నారు.
7. భక్తులు మరింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న విషయం మరొకటి ఉంది. దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఎంతో అనుభవం ఉన్న రాష్ట్ర క్యాడర్ కు చెందిన ఎంతో మంది అధికారులు పోస్టింగ్ లు లేక ఖాళీగా ఉన్న సమయంలో నాన్ క్యాడర్ అధికారి అయిన ధర్మారెడ్డిని ఈ స్పెసిఫైడ్ అథారిటీలో సభ్యుడుగా నియమించడం భక్తులకు మరిన్ని అనుమానాలు కలిగిస్తున్నది. ఈ సందర్భంగా నేను మీకు ఒక సలహా ఇవ్వదలచుకున్నాను. దేవాదాయ ధర్మాదాయ శాఖ వ్యవహారాలలో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి జె ఎస్ వి ప్రసాద్ సేవలను స్పెసిఫైడ్ అథారిటీ సభ్యుడుగా వినియోగించుకుంటే బాగుంటుంది. దయచేసి ఈ విషయాన్ని పరిశీలించండి.
ఈ సందర్భంగా మీడియాలో ప్రముఖంగా ప్రచారం అవుతున్న మరో ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం సబబుగా ఉంటుందని భావిస్తున్నాను. అదేమిటంటే మన ప్రభుత్వం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్ధిక లోటు నుంచి బయటపడేందుకు ప్రభుత్వ బాండ్లను జారీ చేయబోతున్నదనే విషయం. భక్తులు తీవ్రంగా ఆందోళన చెందుతున్న విషయం కూడా ఇదే. మన ప్రభుత్వం జారీ చేసే బాండ్లను కనీసంగా 5000 కోట్ల రూపాయల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానాలతో ఈ స్పెసిఫైడ్ అథారిటీ ద్వారా కొనుగోలు చేయిస్తారని భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇలా చేయడం వల్ల దేవుడి సొమ్మును చట్ట ప్రకారం దారి తప్పిస్తారేమోనని కూడా భక్తులు ఆందోళన చెందుతున్నారు.
మీరు జీవో నెం 146 ను 23వ తేదీన జారీ చేయగానే పైన చెప్పిన అనుమానాలు, ఆందోళనలు అన్నీ కూడా మన ప్రభుత్వం నిజం చేయబోతున్నదనే అపోహ మరింత బలంగా మారిపోయింది.
పైన చెప్పినట్లుగా ప్రజలు అపోహ పడుతున్నట్లుగా చేయడం ద్వారా మన ప్రభుత్వానికి పెద్దగా ఒరిగేదేమీ ఉండదని నేను మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా మన ప్రభుత్వం భారీగా చెడ్డపేరు తెచ్చుకుంటుందని నాకు ఆందోళన కలుగుతున్నది.
పై అనుమానాలన్నీ దృష్టిలో ఉంచుకుని మన ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా ఉండేందుకు నేను మీకు ఒక సలహా ఇవ్వదలచుకున్నాను. స్పెసిఫైడ్ అథారిటీకి ఆర్ధిక విషయాలపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని అయినా తీసివేయండి. కొత్త బోర్డు ఏర్పడిన తర్వాత వారు సంబంధిత ఆర్ధిక నిర్ణయాలు తీసుకోవచ్చు. లేకపోతే మన ప్రభుత్వానికి తీరని చెడ్డపేరు వచ్చి రాబోయే ఎన్నికలపై అది పెను ప్రభావం చూపే అవకాశం కనిపిస్తున్నది.
ఈ సందర్భంగా నేను మీకు ఇచ్చే మరో సలహా ఏమిటంటే మరింత కాలయాపన చేయకుండా తిరుమల తిరుపతి దేవస్థానాలకు నూతన బోర్డును తక్షణమే ఏర్పాటు చేయండి.
ఇలా మీరు చేయడం ద్వారా వేంకటేశ్వరస్వామి భక్తుల విశ్వాసాన్ని మీరు తిరిగి పొందగలుగుతారని నా విశ్వాసం.
భవదీయుడు
కె.రఘురామకృష్ణంరాజు