ఔను! కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు.. సాకే శైలజానాథ్ గురించి ఇటీవల కాలంలో కాంగ్రెస్ నేతల మధ్య వ్యక్తమవుతున్న అభిప్రాయం ఇది. కుంగి కృశించిపోతున్న కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు అందిస్తారనే ఉద్దేశంతో సాకే శైలజానాథ్కు రాహుల్ గాంధీ పట్టంకట్టారు. ఈ క్రమంలోనే రాహుల్ కొన్ని షరతులు కూడా విధించారని.. అప్పట్లోనే వార్తలు వచ్చాయి. వచ్చే ఎన్నికల నాటికి అంటే.. 2024 నాటికి కాంగ్రెస్ను తిరిగి అధికారంలోకి తీసుకురావాలనేది ఈ షరతుల్లో ప్రధానమైంది. దీనికి సాకే కూడా మురిసిపోయారు. ఎందుకంటే.. గతంలో వైఎస్ కు ఎవరూ ఈ షరతు విధించకుండానే.. ఆయన కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చారు.
సో.. ఇప్పుడు తనకు వైఎస్ తర్వాత అంతటి అవకాశం చిక్కినందుకు ఆయన మురిసిపోయి ఉండొచ్చు. కానీ.. పగ్గాలు చేపట్టి.. ఏళ్లు గడిచిపోతున్నా.. సాకే అడుగులు ముందుకు సాగడం లేదు. ఒకప్పుడు రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ గా ఉన్న కాంగ్రెస్కు గత ఎన్నికల్లో అభ్యర్థులు కొరవడిన పరిస్థితి ఏర్పడింది. ఖర్చులు మేం పెట్టుకుంటాం.. టికెట్ మీరు తీసుకోండి! అని అప్పటి కాంగ్రెస్ చీఫ్ రఘువీరా ఆఫర్ ఇచ్చినా.. కొన్ని నియోజకవర్గాలలో ఎవరూ ముందుకు రాలేదు. ఇలాంటి పరిస్థితి నుంచి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడం అంటే.. సాకేకు పెద్ద సవాలుతో కూడా యుద్ధమే!
వివాద రహిత నేతగా, మాజీ మంత్రిగా, ఉన్నత విద్యావంతుడిగా పేరున్న సాకే.. అడుగులు వడివడిగా పడి ఉంటే.. కాంగ్రెస్ పరిస్థితి వేరేగా ఉండేది. కానీ, ఎక్కడికక్కడ ఆయన ఉదాసీన వైఖరినే కనబరుస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నేతల్లో ఆయనకు సానుకూల అభిప్రాయం ఏర్పడకపోగా.. ఇటీవల సారథ్యం లేని పార్టీ అంటూ.. సీనియర్లే గుసగుసలాడుతున్న పరిస్థితి కనిపించింది. తిరుపతి ఉప ఎన్నికలో.. కనీసం రాష్ట్ర చీఫ్గా ఉన్న సాకేకు కూడా తెలియకుండానే అధిష్టానం టికెట్ విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడే.. సాకే సారథ్యం విఫలమైందనే వాదనకు బలం చేకూర్చినట్టయింది.
మరో మూడేళ్లలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. అధికారంలోకి వచ్చే విషయాన్ని పక్కన పెడితే.. పార్టీ అసలు పుంజుకునే పరిస్థితిలో అయినా ఉందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే.. అనేక అవకాశాలు ఉండి కూడా కాంగ్రెస్ మీనమేషాలు లెక్కిస్తోంది. ప్రత్యేక హోదా సహా పోలవరం, వెనుక బడిన జిల్లాల అభివృద్ధి, ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇలా అనేక అంశాలను.. ప్రజల్లోకి తీసుకువెళ్లి.. పుంజుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఆ దిశగా సాకే ప్రయత్నాలు చేయడం లేదు. కొన్నాళ్ల కిందట `ఘర్ వాపసీ` నినాదంతో ముందుకు సాగాలని అనుకున్నారు. ఆ తర్వాతే చాలా మంది మళ్లీ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. సో.. ఇలా సాకే సారథ్యం కలిసి రాలేదని .. సీనియర్లు గుసగుసలాడుతున్న మాట వాస్తవం. ఈ నేపథ్యంలో మళ్లీ పాత సారథి రఘువీరా వైపు అందరూ దృష్టి పెట్టారని.. ఆయనను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని కోరుతున్నారని తెలుస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.