ప్రపంచంపై కరోనా మహమ్మారి తొలిసారిగా విరుచుకుపడిన నేపథ్యంలో గత ఏడాది అందరూ వ్యాక్సిన్ కోసం ఎదురు చూశారు. తీరా, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా…వ్యాక్సిన్ వేయించుకుంటే దుష్ప్రభావాలు వస్తున్నాయంటూ అపోహలు రావడంతో వ్యాక్సిన్ ను చాలామంది వేయించుకోలేదు. ఇక, కోవిడ్ సోకిన వారిలో లైంగిక సామర్థ్యం తగ్గి.. వంధత్వం వచ్చే అవకాశాలున్నాయని గత ఏడాది చైనీస్ సైంటిస్టులు అభిప్రాయపడడంతో చాలామంది వ్యాక్సిన్ కు దూరంగా ఉన్నారు.
చైనా వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికాలోనూ అపోహలు మొదలయ్యాయి. దీంతో, ఆ వ్యవహారంపై ప్రఖ్యాత మియామీ వర్సిటీ కీలక అధ్యయనం జరిపి అసలు నిజాన్ని నిగ్గు తేల్చింది. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల పురుషల్లో లైంగిక సామర్థ్యం తగ్గడంగానీ, వీర్య కణాల సంఖ్య తగ్గడంగానీ జరగలేదని వెల్లడించింది. 2 డోసుల ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు, ఆ తర్వాత వారి లైంగిక సామర్థ్యాన్ని పరీక్షించి మరీ ఈ నిర్ధారణకు వచ్చామని వెల్లడించింది.
ఈ పరీక్షలో పాల్గొన్న పురుషుల్లో 21 మంది ఫైజర్ టీకాను, 24 మంది మోడెర్నా వ్యాక్సిన్ ను తీసుకున్నారని తెలిపింది. ఆ పరిశోధనల్లో సీమెన్ వాల్యూమ్‌తో పాటు స్పెర్మ్ మొటిలిటీ కూడా గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. దీంతో, ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ లపై ఉన్న అపోహలు, అనుమానాలు పటాపంచలైనట్టేనని అంటున్నారు.