దేశంలోనే అతి పురాతన పార్టీగా పేరు పొందిన కాంగ్రెస్ పార్టీ…ప్రస్తుతం సుప్త చేతనావస్థలో ఉన్న సంగతి తెలిసిందే. ఓ వైపు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరు…నాయకత్వ లేమి….వెరసి కార్యకర్తలు డీలా పడుతున్న వైనం కాంగ్రెస్ లోని మహామహా నేతలను సైతం ఆవేదనకు గురిచేస్తోంది. గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ వంటి సీనియర్ నేతలు…కాంగ్రెస్ వెంటిలేటర్ పై ఉందని…సోనియా గాంధీ సరైన నిర్ణయం తీసుకోకుంటే కష్టమని విమర్శిస్తున్నా….పరిస్థితిలో ఏమాత్రం మార్పులేదు.
ఇక, జాతీయ నాయకత్వం ఇలా ఉంటే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండి…బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ రాజీనామా తర్వాత కొత్త టీపీసీసీ చీఫ్ ను నియమించడంలో ఇంకా మీనమేషాలు లెక్కించడం ఇందుకు నిలువెత్తు నిదర్శనం. మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి రూపంలో ఓ బలమైన నేత దొరికాడని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్న తరుణంలో వీహెచ్ వంటి సీనియర్ నేతలు రేవంత్ కు మోకాలడ్డుతున్నారని ప్రచారం జరుగుతోంది.
టీపీసీసీ చీఫ్ ఎంపిక క్లైమాక్స్ కు చేరిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య రాజకీయాలు, వర్గపోరు బట్టబయలవుతున్నాయి. రెండేళ్ల కసరత్తు తర్వాత కూడా ఒకరిని ఎంపిక చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ఉండడంతో బీజేపీ, టీఆర్ఎస్ ల దృష్టిలో ఆ పార్టీ పలుచన అవుతోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డి నియామకం దాదాపుగా ఖరారైందన్న వార్తలు వచ్చాయి.
అయితే, ఈ నేపథ్యంలో….మాజీ ఎంపీ వీహెచ్ చక్రం తిప్పారని, దాంతో ఆ ప్రక్రియ వాయిదా పడిందని కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. సీనియారిటీ, లాయల్టీ అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చినా..అది మూన్నాళ్ల ముచ్చటే అయింది. మరి, ఈ కుమ్ములాటలు వీడితే గానీ కాంగ్రెస్ కు భవిష్యత్తు ఉండదన్న విషయం అధిష్టానం ఎప్పటికి గుర్తిస్తుందో వేచి చూడాలి.