ఏపీ సీఎం జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు కొరకరాని కొయ్యగా మారిన సంగతి తెలిసిందే. జగన్ రెడ్డికి పంటికింద రాయిలా మారిన ఆర్ఆర్ఆర్….కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. పడుకొని ఉన్న సింహం తోక తొక్కితే ఎలా ఉంటుందో జగన్ కు రఘురామ రుచి చూపిస్తున్నారని రాజుగారి అభిమానులు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఇక, తనపై తప్పుడు కేసు పెట్టిన తర్వాత జగన్ పై రాజుగారు స్పీడు పెంచారని, వరుసగా లేఖాస్త్రాలు సంధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని అంటున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా జగన్ రెడ్డికి రఘురామ ఆరో లేఖ సంధించారు. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన మరో హామీ నిలబెట్టుకోవాలని, ఏపీలో ఉద్యోగులకు డీఏ పెంపు హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉద్యోగులకు బకాయిలు పడ్డ ఏడు డీఏలు తక్షణం అమలు చేయాలని ఆర్ఆర్ఆర్ డిమాండ్ చేశారు. డీఏ వాయిదా విషయంలో కేంద్రప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తే ఉద్యోగుల్లో వ్యతిరేకత వస్తుందని హెచ్చరించారు. పార్టీ అధికారంలోకి రావడానికి మూలస్తంభంగా నిలిచిన ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.
తనపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ ఎంపీలు చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవద్దని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రఘురామ ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం కింద తనపై చర్యలు తీసుకోవద్దని, తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని వివరించారు. వైఎస్సార్సీపీ అధికారిక వెబ్సైట్లో ఉండే ఎంపీల జాబితా నుంచి తన పేరును తొలగించడంపై రఘురామ ఫిర్యాదు చేశారు. 48 గంటల్లోగా తన పేరును మళ్లీ వైసీపీ అధికారిక వెబ్సైట్లో చేర్చకపోతే స్వతంత్ర అభ్యర్థిగా తనను ప్రకటించాలని పార్లమెంటు సెక్రటేరియట్‌కు ఫిర్యాదు చేస్తానని అన్నారు. ఈ విషయంపై జగన్‌కు లేఖ రాసినా పట్టించుకోలేదని, కాబట్టి తనను స్వత్రంత్ర ఎంపీగా గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు విన్నవించుకున్నారు.