అనవసరంగా సంబంధంలేని విషయాల్లో తలదూరిస్తే ఏమవుతుందో తాజాగా హైకోర్టు తీర్పుతో స్పష్టమైనట్లే ఉంది. విషయం ఏమిటంటే ఉత్తరాంధ్రలో ఎంతో చరిత్రున్న మాన్సాస్ ట్రస్ట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తలదూర్చింది. అప్పటివరకు ట్రస్ట్ ఛైర్మన్ గా ఉన్న కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు ను తేసేసి సంచయితా గజపతిరాజును ప్రభుత్వం ఛైర్ పర్సన్ గా నియమించింది. ట్రస్ట్ ఛైర్మన్ పదవి ఎప్పుడైతే పోయిందో దాంతో పాటే సింహాచలం దేవస్ధానం ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్ పదవి కూడా పోయింది.
నిజానికి మాన్సాస్ ట్రస్ట్ విషయంలో తలదూర్చాల్సిన అవసరం జగన్ కు లేదు. అయినా సరే ఎవరికోసం ప్రభుత్వం జోక్యం చేసుకున్నదో అర్ధం కావటంలేదు. తన తొలగింపుపై అశోక్ హైకోర్టులో కేసు వేశారు. అశోక్ కు ఛైర్మన్ పదవి వంశపారంపర్యంగా వస్తోంది. గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏ ప్రభుత్వం కూడా మాన్సాస్ ట్రస్ట్ జోలికి వెళ్ళలేదు.
ఏదైనా అవినీతి, అక్రమాలు ఉంటే నియంత్రించాల్సిన ప్రభుత్వం ఏకంగా అశోక్ కు పదవిలో నుండి తీసిపడేసింది. ఇపుడా విషయంపైనే విచారణ జరిపిన కోర్టు అశోక్ ను వెంటనే ఛైర్మన్ గా నియమించాలని ఆదేశించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అశోక్ ఛైర్మన్ గా ఉన్నంతకాలం ఛైర్మన్ గా ఆయన్ను వెనకనుండి నడిపించిన శక్తులు వేరే ఉన్నాయి. అశోక్ హయాంలో కన్నా ఇపుడే ట్రస్టులో పూసపాటి వంశస్ధుల్లో ఎక్కువమందికి చోటు దక్కింది.
అశోక్ స్ధానంలో ఛైర్ పర్సన్ అయిన సంచయిత గజపతిరాజు కూడా పూసపాటి వంశీకురాలే. అశొక్ అన్న ఆనంద గజపతిరాజు కూతురే సంచయిత. అయితే దశాబ్దాలుగా బాబాయ్-అమ్మాయికున్న కుటుంబ వైరంలో ప్రభుత్వం అనవసరంగా జోక్యం చేసుకున్నదనే ఆరోపణలు ఎప్పటినుండో వినిపిస్తున్నాయి. అశోక్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలుగులోకి తేవాలంటే అందుకు మార్గం వేరే ఉంది కానీ ఏకంగా ఆయన్ను ఛైర్మన్ గా తొలగించటమే ప్రభుత్వం చేసిన తప్పని అర్ధమవుతోంది. తాజా ఎపిసోడ్ తో తనకు మాలిన ధర్మం తగదు జగన్…అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.