తనను సీఎంని చేస్తే యువతకు లక్షల కొద్దీ ఉద్యోగాలిస్తానని, ఏడాదికోసారి యూపీఎస్సీ తరహాలో ఏపీపీఎస్సీ పరీక్షల క్యాలెండర్ విడుదల చేస్తానని నాటి ప్రతిపక్ష నేత…నేటి ఏపీ సీఎం జగన్ హామీలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఏదో అరకొరగా వలంటీర్ల వ్యవస్థ పేరుతో తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చిన జగన్….ఆ తర్వాత చెప్పుకోదగ్గ విధంగా ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. దీంతో, రెండేళ్లుగా యువత పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతూ తమ అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగానే, మరోవైపు, గ్రూప్-1 పరీక్ష మూల్యాంకనంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.
గ్రూప్-1 పరీక్షలో డిజిటల్ మూల్యాంకనం విధానం వల్ల అర్హులైన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శ నారా లోకేశ్ నిప్పులు చెరిగారు. ఏపీపీఎస్సీని జగన్ వైసీపీఎస్సీగా మార్చేశారని లోకేశ్ విమర్శించారు. ఏపీపీఎస్సీలో పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో పరీక్ష రాసిన అభ్యర్థులతో లోకేశ్ వర్చువల్‌గా సమావేశమయ్యారు. 2018 నోటిఫికేషన్‌కు 2020 డిసెంబర్లో మెయిన్స్ పరీక్షలు జరిగాయని, అందులో 9,678 క్వాలిఫైడ్ అభ్యర్థుల్లో 340 మందినే ఇంటర్వ్యూకు పిలిచారన్నారు.
కనీస విద్యార్హత లేని వారిని ఏపీపీఎస్సీ సభ్యులుగా నియమించారని లోకేశ్ విమర్శించారు. ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లు, మార్కులు, జవాబు పత్రాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. డిజిటల్ మూల్యాంకనం సాంకేతికతపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. డిజిటల్ మూల్యాంకనం ద్వారా కలిగే నష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ తరహా మూల్యాంకనంలో అక్రమాలు జరిగిన మాట వాస్తవమని, అయినా ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడినట్లు వ్యవహరిస్తోందని లోకేశ్ మండిపడ్డారు.
గ్రూప్-1 పరీక్షల డిజిటల్ మూల్యాంకనం ఇతర రాష్ట్రాల్లో ఉందని జగన్ సర్కార్ చెబుతోంది, ఏ రాష్ట్రంలో ఉందో చెప్పాలని జగన్ ను లోకేశ్ నిలదీశారు. గ్రూప్-1 జోలికొస్తే ఏ1రెడ్డికి ఎలా బుద్ధిచెప్పాలో తమకు తెలుసని, ఎవరూ అధైర్యపడొద్దని అభ్యర్థులకు లోకేశ్ ధైర్యం చెప్పారు. డిజిటల్ మూల్యాంకనం ద్వారా అర్హులైనవారు నష్టపోతున్నారన్నారని, ఈ విషయంపై జగన్ సర్కార్ మొద్ద నిద్ర లేవాలని ఎద్దేవా చేశారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీని గుండు సున్నా చేశారని, పోలీస్ రిక్రూట్‌మెంట్‌ను నిర్వీర్యం చేశారని లోకేశ్ మండిపడ్డారు.