కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న వేళ నెల్లూరు ఆనందయ్య మందు సంజీవనిలా మారిన సంగతి తెలిసిందే. కేవలం ప్రకృతి సిద్ధమైన మూలికలు, ఆకులతో తయారు చేసిన ఆనందయ్య ఆయుర్వేద ఔషధం వాడకానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. సర్వేపల్లి, చంద్రగిరి, కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ సాగుతోంది. అయితే, మిగతా జిల్లాలలోనూ మందు పంపిణీకి ప్రభుత్వ సహకారం కావాలని, మందు తయారీకి అవసరమైన ముడి సరుకును సమీకరించడంలో ప్రభుత్వం సాయం చేయాలని ఆనందయ్య కోరారు.
ఈ ప్రకారం ఏపీ సీఎం జగన్ కు కూడా లేఖ రాశారు. అయితే, జగన్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో, ఈ వ్యవహారంపై ఆనందయ్య సంచలన ప్రకటన చేశారు. మందు తయారీ, పంపిణీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆనందయ్య వెల్లడించారు. మందును బాధితుల ఇళ్లకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వ సహకారం కావాలని కోరినా ఎటువంటి ప్రకటన ప్రభుత్వం తరఫు నుంచి వెలువడలేదని ఆనందయ్య తెలిపారు.
గురువారం సాయంత్రంలోగా ప్రభుత్వం స్పందించకుంటే తన నిర్ణయాన్ని ప్రకటిస్తాని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఎలా పంపాలనే విషయాన్ని తమ బృందంతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తానని అన్నారు. తమ ట్రస్టు ద్వారా ప్రజలకు పంపిణీ చేసే ఆలోచన చేస్తామని అన్నారు. ప్రస్తుతం కృష్ణపట్నంలో మందు తయారు చేస్తున్నామని, 50 వేల మంది పాజిటివ్ వ్యక్తులకు ఇచ్చేందుకు మందు సిద్ధంగా ఉందని తెలిపారు. మరి, ఆనందయ్య డెడ్ లైన్ పై ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
మరోపక్క, ఆనందయ్య మందును తామే తయారు చేశామన్న రీతిలో చెవిరెడ్డి భాస్కర రెడ్డివంటి వైసీపీ నేతలు చేసుకుంటున్న పబ్లిసిటీపై విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఆనందయ్య మందు డబ్బాలపై జగన్, వైఎస్ఆర్ ఫొటోలు వేసుకొని పబ్లిసిటీ చేసుకుంటున్న నేతలు..రాష్ట్రంలోని ప్రజలందరికీ మందు తయారీ, పంపిణీపై శ్రద్ధపెట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.