తెలంగాణలో ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో జరిగిన మంత్రిమండలి సమావేశం ఉద్యోగుల వేతన సవరణ(పీఆర్సీ)కు ఆమోదం తెలిపింది. పెంచిన వేతనాన్ని జూన్ నెల నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. మంత్రిమండలి నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 9,21,037మంది ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పెన్షనర్లు, ఇతర చిన్న ఉద్యోగులకు 30% ఫిట్ మెంట్(వేతనాల పెంపు)తో ప్రయోజనం చేకూరుతుంది. కేజీబీవీ, కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవును మంజూరుచేయాలని నిర్ణయించింది.
తాజా పీఆర్సీతో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు దేశంలోనే సగటున అత్యధిక వేతనాలు అందుకోబోతున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో సబార్డినేట్ ఉద్యోగి బేసిక్ వేతనం నెలకు సుమారు రూ.19 వేలు ఉండగా వచ్చే నెలనుంచి దాదాపు రూ.22,240 వరకు అందుకోబోతున్నాడు. ఇదే క్యాడర్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి నెలకు రూ.18 వేలు, గుజరాత్లో రూ.14 వేలు, పొరుగురాష్ట్రమైన ఏపీలో రూ.13 వేల వరకు అందుకొంటున్నారు. అధికారుల వేతనాలు కూడా అదే స్థాయిలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయి.
గత ఏడు దశాబ్దాల్లో ఏ పీఆర్సీ కూడా పట్టించుకోని దాదాపు ఆరు లక్షల మంది తాత్కాలిక ఉద్యోగులందరికీ రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఫిట్మెంట్ను ప్రకటించడం దేశంలో ఇదే మొదటిసారి. ఉద్యోగులందరికీ పూర్తి, సమగ్ర పీఆర్సీని ప్రకటించడమూ ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఏపీలో పీఆర్సీపై చర్చ మొదలైంది. తెలంగాణలో అడిగిన దానికంటే అధికంగా ఫిట్ మెంట్ ఇచ్చారని, ఏపీలో మాత్రం అసలు ఆ ఊసే లేదని ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. ఏపీలో ఉద్యోగులకు పీఆర్సీ విషయంలో జగన్ నిరాశే మిగిల్చారని అనుకుంటున్నారు.
చంద్రబాబు హయాంలో ప్రతి నెల ఒకటో తేదీన టంచన్ గా జీతాలు, పెన్షన్ లు ఖాతాల్లో పడేవని, ఇపుడు ఆ పరిస్థితి తేదని నీరుగారిపోతున్నారు. ఏపీ ప్రభుత్వానికి పీఆర్సీ రిపోర్టు అందినా నేటికీ దాని జోలికి పోలేదు. సీపీఎస్ విషయంలో కూడా సీఎం జగన్ చెప్పిన మాటలు ఆచరణలోకి రాలేదు. ఇక డీఏ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 2018 జులై నుంచి బకాయిలుగా ఉన్న డీఏని 3 విడతలుగా చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 2021 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఖాతాల్లో జమచేస్తున్నట్టు ప్రకటించింది.
అయితే ఫిబ్రవరి, మార్చిలో జమ కావాల్సిన డీఏ చాలామందికి జమ కాలేదు. అయినప్పటికీ డీఏ జమ అయినట్లుగా భావిస్తూ ట్రెజరీల్లో ఆ మేరకు ఆదాయ పన్ను కోత పెట్టడం కొందరిని ఆందోళనకు గురి చేసింది. దీంతో, తెలంగాణలో ఉద్యోగులకు కేసీఆర్ ‘ఫిట్’ మెంట్ ఇచ్చారని…ఏపీలో ఉద్యోగులకు జగన్ ‘పనిష్’ మెంట్ ఇచ్చారని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరి, తెలంగాణ సీఎంను ఏపీ సీఎం ఫాలో అవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.