ఏపీ సీఎం జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల పోలింగ్ తేదీకి కొద్ది రోజుల ముందు జరిగిన ఈ హత్య రాజకీయంగా కలకలం రేపింది. అయితే, వివేకా వంటి హై ప్రొఫైల్ వ్యక్తి హత్య జరిగి రెండేళ్లు పూర్తయినా…అసలు దోషులెవరన్నది తేలలేదు. దీంతో, ఈ కేసు విచారణపై వివేకా కుమార్తె సునీతారెడ్డి పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో సీబీఐ ఉన్నతాధికారులను కలిసిన సునీతా…ప్రెస్ మీట్ పెట్టి మరీ తన ఆవేదన వెళ్లగక్కారు.
జగన్ సీఎంగా ఉన్నా కేసు విచారణ ఎందుకు ముందుకెళ్లడం లేదో జగన్ నే అడిగితే బాగుంటుందని మీడియాకు సునీతా చెప్పడం సంచలనం రేపింది. ఈ కేసు విచారణలో ఏపీ ప్రభుత్వం సహకారం ఉంటే తాను ఢిల్లీవరకు ఎందుకొస్తానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కరోనా నేపథ్యంలో సీబీఐ విచారణ మందకొడిగా సాగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కోవిడ్ తగ్గుముఖం పడుతుండడంతో గత రెండు రోజులుగా వివేకా హత్యకేసు విచారణ మళ్లీ పట్టాలెక్కింది. ఇప్పటికే కడపలో రెండు రోజులుగా వివేకా హత్యకేసుకు సంబంధించి పలువురిని సీబీఐ అధికారులు విచారణ జరిపారు.
మూడోరోజు విచారణ సందర్భంగా గతంలో వివేక ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన ఇదయతుల్లా, వైసీపీ కార్యకర్త కిరణ్‌కుమార్ యాదవ్‌ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరినీ నిన్న కూడా ప్రశ్నించిన అధికారులు ఈ రోజు కూడా వారి నుంచి పలు వివరాలను రాబడుతున్నారు. వివేక హత్య కేసులో కిరణ్ కుమార్ యాదవ్ అనుమానితుడిగా ఉన్నాడు. వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి కూడా మూడో రోజు విచారణకు హాజరయ్యారు. ఏది ఏమైనా సునీతా తన తండ్రి హత్య కేసులో న్యాయపోరాటాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకువెళ్లడంతోనే విచారణ వేగవంతం అయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే సీబీఐ అధికారులు కూడా విచారణ వేగవంతం చేశారన్న ప్రచారం జరుగుతోంది.