సంచలనంగా మారిన ఆనందయ్య మందు ఎపిసోడ్ లో.. రాజకీయ రగడ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆనందయ్య మందును వెబ్ సైట్ పెట్టి అమ్ముకోవాలని చూశారంటూ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే (సర్వేపల్లి నియోజకవర్గం) కాకాణి గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రహోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేయటం తెలిసిందే.
దీనిపై కాకాణి స్పందిస్తూ.. ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం.. అందులో సోమిరెడ్డిపైన తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన వైనం వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా.. సోమిరెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవాలు లేవంటూనే.. ఆయనపై కేసులు నమోదు చేశారు. దీనిపై సోమిరెడ్డి స్పందిస్తూ.. తాను చేసిన ఆరోపణలన్ని నిజాలే అని పేర్కొన్నారు.
తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై కాకాణి ఊహించని విధంగా రియాక్టు అయ్యారు. భారీ శఫధాన్ని చేశారు. ‘వెంకయ్య స్వామిపై ప్రమాణం చేసి చెబుతున్నా. ఆనందయ్య మందును అడ్డు పెట్టుకొని డబ్బు సంపాదించాలనుకున్నా.. ఆ దిశగా ఆలోచన చేసినా.. నేను .. నా కుటుంబ సభ్యులు సర్వనాశనమైపోతాం’ అంటూ తీవ్ర వ్యాఖ్య చేశారు.
తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారికి ఏ శిక్ష విధించాలో దేవుడే చూసుకుంటారన్నారు. రాజకీయాలు ఆరోపణలు.. ప్రత్యారోపణలు మామూలే కానీ.. ఈ స్థాయిలో అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యే ప్రమాణం చేయటం మాత్రం సంచలనంగా మారింది.
అయినా తిరుపతిలో కూడా అవినీతికి పాల్పడుతున్న నేతలున్న ఈ కలియుగంలో వీళ్ల ప్రమాణాలను జనం ఎంతవరకు విశ్వసిస్తారో మరి.