అగ్గిపుల్లా…సబ్బు బిళ్లా…కుక్క పిల్లా…కాదేది కవితకనర్హం…అన్నారు మహా కవి శ్రీశ్రీ….ఆ మందు..ఈ మందు…ఆనందయ్య కరోనా మందు..కాదేదీ పబ్లిసిటీకి అనర్హం అంటున్నారు వైసీపీ నేతలు. రాజకీయ నాయకులకు పబ్లిసిటీ పిచ్చి ఉండడం చూశాం గానీ…వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పబ్లిసిటీ పిచ్చి మాత్రం పరాకాష్టకు చేరిందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఆనందయ్య కరోనా మందును కూడా తన పబ్లిసిటీకి వాడుకున్న చెవిరెడ్డి వాడకం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. పబ్లిసిటీ చేసుకుంటే చేసుకున్నారు కానీ,…అసలు ఆ మందు తయారు చేసిన ఆనందయ్య ఫొటోను చెవిరెడ్డి మరచిపోవడంతో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఆఖరికి వైసీపీ నేతలు ఆనందయ్య కరోనా మందునూ తమ ప్రచారానికి వాడుకుంటున్నారని, దూకుడు సినిమాలో మహేష్ బాబు కూడా బ్రహ్మానందాన్ని ఈ రేంజ్ లో వాడలేదని సెటైర్లు వేస్తున్నారు. ఇక, కరోనా మందు డబ్బా మూత మీద వైఎస్సార్, జగన్, చెవిరెడ్డి ఫొటోలు మాత్రమే ఉండడంతో…ఈ ముగ్గురిలో ఆనందయ్య ఎవరో చెప్పుకోండి చూద్దాం అంటూ చురకలంటిస్తున్నారు. అసలు మందు కనిపెట్టటిన ఆనందయ్య ఫొటో మూత మీద లేకపోవడంతో సొమ్మొకడిది..సోకొకడిది.. అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
ఇక, ఆనందయ్య మందు డబ్బా మీద మాత్రం మొక్కుబడిగా ఆనందయ్య ఫొటోను కూడా చెవిరెడ్డి ప్రింట్ చేయించారని విమర్శలు గుప్పిస్తున్నారు. కరోనాను కట్టడి చేయడంలో విఫలమైన జగన్….వైసీపీ నేతలు…ఆనందయ్య కు దక్కాల్సిన క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. కరోనాపై జగన్ చేతులెత్తేశారని స్వయంగా మాట్లాడుకున్న వైసీపీ నేతలు…ఇపుడు తామే కరోనాకు మందు కనిపెట్టామన్నంత బిల్డప్, పబ్లిసిటీ ఇవ్వడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.