ప్రాణం ముఖ్యమా? డబ్బులు ముఖ్యమా? మరో మాట అవకాశం లేకుండా ప్రాణమే ముఖ్యమని చెబుతారు. వ్యక్తులకే కాదు.. ప్రభుత్వాలకు సైతం ఇదే సూత్రం వర్తిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాంటి వేళ.. ఏపీలోని జగన్ సర్కారు చేపట్టిన టీకా కొనుగోలు వ్యూహం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీస్తోంది.
టీకాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న పాలసీపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై వివరణ ఇచ్చేందుకు విడుదల చేసిన వివరాలు ప్రభుత్వానికి ఇప్పుడు తలనొప్పిగా మారాయన్న మాట వినిపిస్తోంది.
వ్యాక్సిన్ల కోసం తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోందని.. టీకాల కొనుగోలుకు ఆయా కంపెనీలకు ఆర్డర్లు పెట్టినట్లుగా వివరాల్ని వెల్లడించారు. దీని ప్రకారం.. మే 3, 7, 23తో పాటు జూన్ 5న కోవీషీల్డ్ కోసం ఆర్డర్లు పెట్టింది ఏపీ ప్రభుత్వం.30.7లక్షల డోసుల ఆర్డర్ ఇచ్చారు.
దీని విలువ రూ.96.88 కోట్లు. అదే సమయంలో భారత్ బయోటెక్ వారి కోవాగ్జిన్ కోసం మే 3, మే 23న ఆర్డర్లు పెట్టారు. 6.8లక్షల డోసులు ఆర్డర్ ఇచ్చారు. దీని విలువ రూ.28.7 కోట్లుగా పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ కు మించిన ప్రాధాన్యత కార్యక్రమం మరొకటి లేదు. రేటు ఎక్కువా? తక్కువా? అన్న అసలు విషయమే కాదు. ఎందుకంటే.. ప్రజారోగ్యానికి మించింది లేదు. ప్రభుత్వం చేపట్టే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు వేలాది కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు.. టీకాల కోసం పెట్టే ఖర్చు ఒక లెక్కలోకి రాదు. అలాంటప్పుడు.. ఆర్డర్ పెట్టేటప్పుడే మరింత భారీగాపెట్టాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వం విడుదల చేసిన వివరాల్ని చూస్తే.. మేలో మూడో తేదీన మొదటి ఆర్డర్ పెడితే.. నాలుగు రోజులకే రెండో ఆర్డర్ పెట్టేశారు. కానీ.. మూడో ఆర్డర్ కోసం పదహారు రోజుల సమయాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత ఆర్డర్ జూన్ ఐదున ఇచ్చారు. మే 23 నుంచి జూన్ 5 మధ్యన దాదాపు 12 రోజుల వ్యవధి ఉంది. ఆర్డర్లను భారీగా ఇచ్చేయటం ద్వారా.. టీకా కంపెనీలకు మన అవసరం ఎంత ఉందన్న విషయాన్ని చెప్పినట్లు అవుతుంది.
వంట చేయటానికి పావు గంట ముందు సరుకుల కోసం కిరాణా షాపుకు వెళ్లటం ఎలా ఉంటుందో.. టీకాలకు సంబంధించిన ఆర్డర్లు కూడా అదే తరహాలో ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలా కాకుండా.. పెద్ద మొత్తంలో మూడు నెలల సరిపడా ఆర్డర్ ముందే ఇస్తే ఏం కొంపలు మునుగుతాయి.
భారత్ బయోటెక్ కు ఇచ్చిన ఆర్డర్ చాలా తక్కువగా ఉండటం గమనార్హం. కొవిషీల్డ్ 30.75 లక్షల డోసులు ఆర్డర్ ఇస్తే.. అందులో 20 శాతం టీకాలే కోవాగ్జిన్ ఆర్డర్ ఇవ్వటం దేనికి నిదర్శనం? ఆర్డర్ ఇచ్చినంతనే అడ్వాన్సు చెల్లించాల్సిన ఇబ్బంది ఉంటే.. అందుకు తగ్గట్లు నిధుల్ని విడుదల చేయాలే కానీ.. ఇలా పొదుపుగా ఆర్డర్ పెడితే ఎలా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మరి.. దీనికి ఏపీ సర్కారు ఏమంటుందో? ప్రభుత్వం వెల్లడించిన వివరాల్ని చూసినప్పుడు.. టీకా విషయంలో ప్లానింగ్ సరిగా లేదన్న అభిప్రాయం కలుగక మానదు.