సుదీర్ఘ పార్లమెంటు చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో చోటు చేసుకున్న సీన్ ఒకటి ఆసక్తికరంగా మారింది. మీడియాలో పెద్దగా ఫోకస్ కాని ఈ ఉదంతం చెప్పే ఊసులు ఎన్నో ఉన్నాయని చెప్పాలి. ఓపక్క ఇప్పటి రోజుల్లోనూ ఇలాంటివి రాజకీయాల్లో ఉంటాయా? అనిపిస్తూనే.. మరోవైపు వేలు చూపించే వైనం తాజా ఉదంతంలో ఉందని చెప్పాలి. ఇంతకూ ఏం జరిగిందన్నది చూస్తే..
వ్యవసాయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆదివారం రాజ్యసభలో చోటు చేసుకున్న పరిణామాల గురించి తెలిసిందే. బిల్లుపై చర్చ సందర్భంగా అధికార ఎన్డీయే తీరును విపక్ష నేతలు తీవ్రస్థాయిలో తప్పు పట్టారు. వారి అభ్యంతరాలపై సమగ్రమైన చర్చ జరగకుండానే బిల్లు ఆమోదం పొందిన తీరును తప్పు పట్టటం తెలిసిందే.
ఈ సందర్భంగా విపక్ష నేతలు పలువురు రాజ్యసభలో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. బెంచీల మీదకు ఎక్కటం.. మైకులు విరగొట్టటం.. పేపర్లను చించేయటం.. లాంటివెన్నో చేశారు. దీంతో.. విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు వేస్తూ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు.
దీనిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన విపక్ష సభ్యులు పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేపట్టారు. గతంలో ఎప్పుడూ.. ఏ సందర్భంలోనూ లేని రీతిలో 24 గంటల పాటు నాన్ స్టాప్ గా ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా విపక్ష నేతలు కలలో కూడా ఊహించని రీతిలో ఒక పరిణామం చోటు చేసుకుంది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ ఉదయాన్నే నిరసన చేస్తున్న సభ్యులకు టీ.. స్నాక్స్ ను తీసుకెళ్లారు. ఇలాంటివి ఇప్పటివరకు చోటు చేసుకోలేదు. దీంతో.. నిరసన చేస్తున్న విపక్ష సభ్యులు విస్తుపోయారు.
ఇదిలా ఉంటే.. డిప్యూటీ ఛైర్మన్ హోదాలో ఉన్న హరివంశ్ తనతో పాటు మీడియా సభ్యుల్ని తీసుకురావటం.. తాను టీ.. స్నాక్స్ అందించే విషయాల్ని కవర్ చేయటం లాంటి వాటితో అసలు విషయాన్ని అర్థం చేసుకున్న విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీ తీసుకునేందుకు నో చెప్పారు. నిరసన శిబిరం వద్దకు హరివంశ్ వెళ్లి ఎంపీలను పరామర్శించటాన్ని ప్రశంసిస్తూ ప్రధాని మోడీ పేర్కొనటం గమనార్హం.
సభలో తనపై దాడికి పాల్పడి (దాడి చేయలేదు.. అలాంటి ప్రయత్నం జరిగింది).. దూషించిన వారికి హరివంశ్ టీ అందించటం గొప్ప విషయంగా అభివర్ణించారు. ఆయన చేసిన పనికి అభినందిస్తున్నట్లుగా పేర్కొంటూ ట్వీట్ చేశారు. మొత్తంగా డిప్యూటీ ఛైర్మన్ తీరు రోటీన్ కు భిన్నంగా ఉన్నప్పటికీ.. అదంతా కూడా వ్యూహాత్మకంగా చేసిన పనిగా విపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయం అంటే అలానే ఉంటుంది కదా?