టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేతగా ఓ వెలుగువెలిగి… తాజాగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ సమయంలో పార్టీ అంతర్గత పరిణామాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
గుడ్ బై చెప్తున్న సందర్భంగా ఆయన చేసిన పలు సంచలన వ్యాఖ్యల్లో ప్రధానంగా హైలెట్ అయింది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మేనల్లుడు, మంత్రి హరీశ్ రావు గురించి చేసిన కామెంట్లు. ఈటల వ్యాఖ్యలతో మరోమారు హరీశ్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అయితే, ఈటలకు తాజాగా మంత్రి హరీశ్ కౌంటర్ ఇచ్చారు.
టీఆర్ఎస్ పార్టీలో తాను నిబద్దత, విధేయత, క్రమశిక్షణ ఉన్న కార్యకర్తను అని మంత్రి హరీశ్ రావు క్లారిటీ ఇచ్చారు.
“పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు నాకు పార్టీ ప్రయోజనాలే పరమావధి. పార్టీ కార్యకర్తగా ఉన్న నాకు పార్టీ, నాయకత్వం ఏ పని అప్పగించినా దాన్ని పూర్తిచేయడం నా విధి, బాధ్యత. పార్టీ నాయకుడిగా కేసీఆర్ ఏ ఆదేశం ఇచ్చినా శిరసావహించడం నా కార్తవ్యంగా భావిస్తాను“ అంటూ తేల్చిచెప్పారు.
“కేసీఆర్ గారు పార్టీ అధ్యక్షులే కాదు.. నాకు గురువు, నా మార్గదర్శి, నాకు తండ్రితో సమానులు. ఆయన మాట జవదాటకుండా నడుచుకుంటున్నాను. గతంలో అనేకసార్లు ఇదే విషయం సుస్ఫష్టంగా అనేక వేదికలపై చెప్పాను. ఇప్పుడు మరోసారి చెప్తున్న. కంఠంలో ఊపిరిఉన్నంత వరకు ఇలాగే నడుచుకుంటాను.“ అంటూ తనకు మరో ఆలోచన లేదన్న మాటను హరీశ్ తేల్చిచెప్పారు.
తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందన్నట్టుగా ఉన్నది ఈటల రాజేందర్ వైఖరి అంటూ హరీశ్ ఫైర్ అయ్యారు. “పార్టీని వీడడానికి ఆయనకు అనేక కారణాలుండొచ్చు. పార్టీలో ఉండాలా.. వెళ్లిపోవాలా అన్నది ఆయన ఇష్టం. ఆయన పార్టీని వీడినప్పటికీ టీఆర్ఎస్ పార్టీకి వీసమెత్తు నష్టం కూడా లేదు. ఆయన పార్టీకి చేసిన సేవ కన్నా.. పార్టీ ఆయనకు ఇచ్చిన అవకాశాలే ఎక్కువ.
తన సమస్యలకు , తన గొడవకు నైతిక బలం కోసం పదేపదే నా పేరును ప్రస్తావించడం ఈటల రాజేందర్ భావదారిద్య్రానికి, విజ్ఙత, విచక్షణలేమికి నిదర్శనం. నా భుజాల మీద తుపాకి పెట్టాలనుకోవడం విఫల ప్రయత్నం మాత్రమే కాదు.. వికారమైన ప్రయత్నం కూడా. ఆయన మాటల్లో మనో వికారమే తప్ప సత్యం ఎంత మాత్రం లేదు. నా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్న“ అంటూ మంత్రి హరీశ్ రావు ఈటల రాజేందర్ విషయంలో తన వైఖరి తేల్చిచెప్పారు.