దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్ సోదరి.. వైఎస్ షర్మిల ప్రారంభించనున్న పొలిటి కల్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) పచ్చజెండా ఊపిందా? షర్మిల ప్రయత్నానికి ఓకే చెప్పిందా? అంటే.. ఔననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు.
తెలంగాణ రాజకీయాల్లో మార్పులు తీసుకువస్తామంటూ.. రాజకీయ పార్టీ ప్రారంభించేందుకు రెడీ అయిన షర్మిల ఇప్పటికే తెలంగాణలో తనదైన శైలిలో ప్రచారం కూడా ప్రారంబించారు.
ఖమ్మం వేదికగా.. కొన్ని వారాల కిందట భారీ ఎత్తున సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులకుఉద్యోగాలు ఇవ్వడం లేదని.. ఆరోపిస్తూ.. నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే.
ఇక, ఈ క్రమంలోనే కొత్త పార్టీ ఏర్పాటుకు షర్మిల కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. వైఎస్ జయంతి సందర్భంగా జూలై 8న పార్టీ ప్రారంబిస్తామని, ప్రకటిస్తామని.. గతంలో షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే.. ఇప్పుడు ఈ నిర్ణయాన్ని మార్చుకుని.. రాబోయే రెండు రోజుల్లోనే పార్టీని ప్రకటించేందుకు షర్మిల ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వాడుక రాజగోపాల్ పేరిట కొత్త పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు.
రాజగోపాల్ వైఎస్ జీవించి ఉన్న కాలం నుంచి వైఎస్ ఫ్యామిలీలో మెంబర్ గా ఉన్నారు. ఆయనతో పాటు ఇద్దరు సభ్యులను కూడా పార్టీ కీలక నేతలుగా ప్రకటించారు.
దీనికి సంబంధించి జాతీయ మీడియాలో తాజాగా ప్రకటన ఇచ్చారు. పార్టీ పేరును `వైఎస్సార్ తెలంగాణ పార్టీ`గా నిర్ణయించారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే.. ఇప్పటి వరకు ఎవరూ ఈ పార్టీ పేరుపై అభ్యంతరాలు చెప్పలేదని తెలిసింది.
ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లోనే ఎన్నిక లసంఘం పార్టీ పేరును ఖరారు చేయడం ఖాయమని తెలుస్తోంది. ఇది జరిగిన వెంటనే షర్మిల పార్టీని ప్రకటించి.. ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించినట్టు లోటస్ పాండ్ వర్గాలు పేర్కొన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.