ముప్పేట వచ్చిన విమర్శలు, హైకోర్టు నుంచి వచ్చిన ఘాటు వ్యాఖ్యల ఫలితంగా ఎట్టకేలకు కరోనా చికిత్సలో భాగంగా అధిక డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝుళిపించిన సంగతి తెలిసిందే.
బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అధిక డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ వైద్యశాలల లైసెన్స్‌లను రద్దు చేయడంతోపాటు షోకాజ్ నోటీసులు వైద్యారోగ్య శాఖ జారీ చేస్తోంది. తాజాగా రాష్ట్రంలో ఇవాళ మరో ఆరు ఆస్పత్రుల లైసెన్సులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఇక్కడే సీన్ మారుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 22 ఆస్పత్రుల లైనెన్స్‌లు రద్దయ్యాయి. 113 దవాఖానలకు వైద్య ఆరోగ్యశాఖ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఇవాళ కొత్తగా 8 ప్రైవేట్ దవాఖానలకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆఫీస్‌కు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు క్యూకడుతున్నారు.
కొవిడ్ లైసెన్స్ రద్దు చేయడంతో డీహెచ్ శ్రీనివాస్‌రావుతో వేర్వేరుగా భేటీ అవుతున్నారు. కిమ్స్ భాస్కర్‌రావు, సన్‌షైన్ గురువారెడ్డి ఇతర కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు, ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా వారు పలు కీలక అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.
తమ ఆస్పత్రులకు కొవిడ్ లైసెన్స్ రద్దు చేయడంపై తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వద్ద సదరు ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులు ఆరా తీశారని సమాచారం. తమ ఆస్పత్రులను మంచి రెప్యుటేషన్‌తో నడుపుకుంటున్నామని పేర్కొన్నారు.తమ రెప్యుటేషన్ పోవాలని కోరుకోవడం లేదని తెలిపారు.
వైద్యశాఖ నోటీసులు, కొవిడ్ లైసెన్స్ రద్దుపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. మున్ముందు మూడో వేవ్ వచ్చే అవకాశం ఉన్నందున లైసెన్స్ రద్దు చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారని డీహెచ్‌కు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు, ప్రతినిధులు స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నామని డీహెచ్ తెలిపినట్లు సమాచారం.