మొదటి దశకు భిన్నంగా రెండో వేవ్ లో లాక్ డౌన్ విధింపులో దేశంలోని ఒక్కో రాష్ట్రం ఒక్కోలా వ్యవహరించింది. కొన్ని రాష్ట్రాలు అత్యంత ముందుచూపుతో వ్యవహరిస్తే.. మరికొన్ని రాష్ట్రాలు అమితమైన ఆలస్యాన్ని ప్రదర్శించాయి.
రాష్ట్రాల్లో విధించాల్సిన లాక్ డౌన్ విషయంలో కేంద్రం తన నిర్ణయాన్ని సూటిగా చెప్పేసి ఉంటే బాగుండేది. కానీ.. ప్రధాని అలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. కాస్త అటు ఇటుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు పాక్షిక లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.
మొన్నటికి మొన్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ ను మరో పది రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో గతంలో మాదిరి లాక్ డౌన్ అమలు చేస్తుంటే.. తెలంగాణలో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంటకు.. ప్రయాణాల కోసం మరో గంటను అదనంగా చేర్చి.. రెండు గంటల తర్వాత నుంచి కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తామని చెప్పారు.
మరి.. ఎన్నిరోజుల పాటు లాక్ డౌన్ అమల్లో ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే.. తెలంగాణ సీఎం ఒక అడుగు ముందుకు వేసి.. లాక్ డౌన్ ఎత్తివేసేది ఎప్పుడన్న విషయంపై కాస్తంత క్లారిటీతో చెప్పారని చెప్పాలి.
కేసుల పాజిటివిటీ 5 శాతం కంటే తక్కువైనంతనే రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తి వేస్తామని చెప్పారు.తాజాగా ఇదే విషయంపై ఐసీఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ కీలక వ్యాఖ్యలు చేశారు.లాక్ డౌన్ ఎత్తి వేయటంలో మూడు అంశాలు ముఖ్యమని చెప్పారు.
తక్కువ పాజిటివిటీ రేటు.. అత్యధికంగా టీకాలు.. కొవిడ్ నిబంధనల్ని పక్కాగా అమలు చేయటం చాలా ముఖ్యమన్నారు. కేసీఆర్ చెప్పినట్లే ఐదు శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు నమోదవుతూ.. కొవిడ్ ముప్పు అధికంగా ఉన్న వర్గాలకు 70 శాతం టీకాలు వేయటం పూర్తి చేసి.. కొవిడ్ నిబంధనల్ని పక్కాగా అమలు చేసే పక్షంలో లాక్ డౌన్ ఎత్తి వేయొచ్చని చెప్పార.
లాక్ డౌన్ లను చాలా నెమ్మదిగా మాత్రమే సడలించాలని ఆయన పేర్కొన్నారు. ఇదంతా చూస్తే.. జూన్ లోకూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలయ్యే అవకాశమే ఉందని చెప్పాలి. జులై మధ్యలో లాక్ డౌన్ ను పూర్తిస్థాయిలో ఎత్తి వేసే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే.. జూన్ చివరి నుంచి జులై మధ్య కాలంలో ప్రస్తుతం అమలు చేస్తున్న లాక్ డౌన్ నిబంధనల్ని మరింత సడలించే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.