దశాబ్దంన్నర పాటు అన్యోన్యంగా వైవాహిక జీవితం సాగించారు అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా. వాళ్లిద్దరి పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్లవుతున్న తరుణంలో ఆమె భర్త నుంచి విడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి మించిన షాక్ ఏంటంటే.. తనకంటే పన్నెండేళ్లు చిన్నవాడైన యువ కథానాయకుడు అర్జున్ కపూర్‌తో ఆమె కొత్త బంధం మొదలుపెట్టింది.
అసలు అర్జున్‌తో ప్రేమలో పడటం వల్లే అర్బాజ్ నుంచి ఆమె విడిపోయిందన్నది బాలీవుడ్ వర్గా మాట. ముందు వీళ్లిద్దరూ తమ బంధాన్ని బయటపెట్టడానికి సంకోచించారు. కానీ విడాకుల తర్వాత కొంత కాలం గడవగానే తమ రిలేషన్ గురించి వీళ్లిద్దరూ ఓపెన్ అయిపోయారు.
ఇద్దరూ కలిసి ఉన్న సన్నిహిత ఫొటోలను షేర్ చేస్తున్నారు. తమ బంధం గురించి కొద్ది కొద్దిగా మీడియాకు కబుర్లు అందిస్తున్నారు. సహజీవనం చేస్తున్న ఈ జంట గత ఏడాది ఒకేసారి కరోనా బారిన పడటం కూడా తెలిసిందే.
కాగా ఇప్పుడో ఆసక్తికర కబురుతో ఈ జంట వార్తల్లోకి వచ్చింది. మలైకా కోసం ముంబయిలోని బాంద్రాలో అర్జున్ ఒక ఖరైదీన విల్లా తీసుకున్నాడట. దాని విలువ ఏకంగా రూ.23 కోట్లని తెలిసింది. మలైకా ప్రస్తుతం ఉంటున్న ఇంటికి సమీపంలోనే ఈ విల్లా ఉంటుందట. తమ ప్రేమకు గుర్తుగా ఈ కొత్త ఇంటిని కొన్నాడని.. ఇకపై మలైకాతో కలిసి అర్జున్ ఇక్కడే ఉండబోతున్నాడని బాలీవుడ్ మీడియా పేర్కొంటోంది.
ఇటీవలే ముంబయిలో బిగ్-బి అమితాబ్ బచ్చన్ ఏకంగా రూ.31 కోట్లు పెట్టి ఒక లగ్జరీ అపార్ట్మెంట్లో డూప్లెక్స్ కొనడం చర్చనీయాంశమైంది. అమితాబ్ బచ్చన్ స్థాయికి రూ.31 కోట్లు పెట్టొచ్చు కానీ.. అర్జున్ తన ప్రేయసి కోసం రూ.23 కోట్ల విల్లా తీసుకోవడం అంతకుమించిన వార్తే. ముంబయిలో బాంద్రా అంటే అత్యంత ఖరీదైన ప్రాంతం. అక్కడంతా సెలబ్రెటీలే ఉంటారు. అక్కడ ఒక మోస్తరు ప్రాపర్టీ కొనాలన్నా పది కోట్లు పెట్టాల్సిందే. ఇక లగ్జరీ విల్లా అంటే రూ.23 కోట్లు పెట్టడంలో ఆశ్చర్యం లేదు.