బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్, వెస్ట్ మినిస్టర్ క్యారీ సైమండ్స్ లు ప్రేమాయణం గత రెండేళ్లుగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. 2019లో జాన్సన్ ప్రధానమంత్రి అయిన తర్వాత నుంచి వీరిద్దరూ కలిసి డౌనింగ్ స్ట్రీట్లో కలిసి ఉంటున్నారు. 2020 ఫిబ్రవరిలో వీరిద్దరికీ నిశ్చితార్ధం జరగగా…వీరికి ఇప్పటికే ఏడాది వయసున్న కొడుకు ఉన్నాడు. వీరిద్దరూ ఈ ఏడాది జులైలో పెళ్లి చేసుకోబోతున్నారని గతంలో కథనాలు వచ్చాయి.
అయితే, అనూహ్యంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రహస్యంగా క్యారీ సైమండ్స్ ను పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశమైంది. తాజాగా బోరిస్ జాన్సన్ ముచ్చటగా మూడో వివాహం చేసుకున్నారని యూకే మీడియాలో కథనాలు వస్తున్నాయి. తన కంటే 23 సంవత్సరాలు చిన్నదైన క్యారీ సైమండ్స్ ను ఇరు కుటుంబాలు, స్నేహితుల సమక్షంలో బోరిస్ జాన్సన్ నిరాడంబరంగా వివాహం చేసుకున్నారట. ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో 30 మంది అతిథులు మాత్రమే ఈ సీక్రెట్ పెళ్లికి హాజరయ్యారట.
1822లో లార్డ్ లివర్పూల్ తర్వాత బ్రిటన్ ప్రధాని పదవిలో ఉంటూ వివాహం చేసుకున్న తొలి వ్యక్తి బోరిస్ జాన్సన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రెండు సార్లు విడాకులు తీసుకున్నారు. తనకు ఎంతమంది పిల్లలు ఉన్నారో చెప్పేందుకు నిరాకరించారు. జాన్సన్ చివరి వివాహం మెరీనా వీలర్ అనే న్యాయవాదితో జరిగింది. గతంలో బోరిస్(56) వివాహేతర సంబంధంతో కన్జర్వేటివ్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు.