సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌లో రఘురామ నేడు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రఘురామ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన వైద్యులు… ఆయనకు సిటీస్కాన్, ఎమ్మారై స్కాన్‌తో పాటు పలు రకాల వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే రఘురామ పాదాలకు తీవ్ర గాయాలైనట్లు ఎయిమ్స్ వైద్యులు గుర్తించారు.
రఘురామ పాదాల్లో సెల్ డ్యామేజ్ ఎక్కువగా జరిగిందని వైద్యులు గుర్తించారు. దీంతో, ఆయన రెండు కాళ్లకు పీవోపీ కట్టు కట్టి చికిత్స అందిస్తున్నారు. రఘురామకు 2 వారాల పాటు విశ్రాంతి అవసరమని, రెండు వారాలపాటు ఆయన ఎట్టి పరిస్థితుల్లో నడవడానికి వీల్లేదని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. పరీక్షలు ముగిసిన తర్వాత ఎయిమ్స్ నుంచి నేరుగా తన అధికారిక నివాసానికి రఘురామ చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే రఘురామ ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ ఆరా తీశారు.
ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియాకు హర్షవర్థన్ ఫోన్ చేసి రఘురామరాజుకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారని తెలుస్తోంది. దీంతో ఎంపీ రఘురామరాజుకు ఎయిమ్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. రఘురామ త్వరగా కోలుకోవాలని హర్షవర్థన్ ఆకాంక్షించారు. అంతకుముందు, ‘ఈ కష్ట సమయంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని రఘురామకృష్ణరాజు ట్వీట్ చేశారు.