2015లో ఓటుకు నోటు కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసేందుకు గాను ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో నాటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి రాయబారం నడిపినట్టుగా ఆరోపణలు వచ్చాయి. స్టీఫెన్సన్కు రేవంత్‌రెడ్డి 50 లక్షలు ఇచ్చినట్టుగా ఆరోపిస్తూ వచ్చిన వీడియోలు కలకలం రేపాయి.
అంతేకాదు, ఈ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుకూ సంబంధం ఉందంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే, ఆ కేసుతో చంద్రబాబుకు సంబంధం లేదంటూ టీడీపీ నేతలు చెబుతున్నా…విపక్షాలు మాత్రం విష ప్రచారం ఆపలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పలుగడిగిన ముత్యంలా బయటకు వచ్చారు. ఈ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏసీబీ, ఈడీ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు. దీంతో, ఈ కేసులో చంద్రబాబుకు ఊరట లభించినట్లయింది.
ఈ కేసులో ప్రస్తుత కాంగ్రెస్ నేత, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్‌రెడ్డిపై ఈడీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఏసీబీ గతంలో దాఖలు చేసిన చార్జ్‌షీట్ ఆధారంగా ఎంపీ రేవంత్‌పై మనీలాండరింగ్ కేసు నమోదైంది. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నాటి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో నాటి టీడీపీ నేత రేవంత్ రాయబారం నడిపినట్టుగా చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.
వేం నరేందర్‌రెడ్డికి ఓటు వేయాల్సిందిగా స్టీఫెన్సన్ను రేవంత్ ప్రలోభాలకు గురిచేశారని, రూ.50 లక్షల నగదు ఇస్తూ పట్టుబడ్డారని ఏసీబీ అభియోగం మోపింది. ఛార్జ్‌షీట్‌లో ప్రధాన నిందితుడిగా ఎంపీ రేవంత్‌రెడ్డిని అధికారులు పేర్కొన్నారు. ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ లో చంద్రబాబుతో పాటు పలువురి పేర్లు న్నప్పటికీ…చంద్రబాబును నిందితుడిగా ఈడీ పేర్కొనలేదు. దీంతో, ఈ కేసులో చంద్రబాబుకు ఊరట లభించినట్లయింది.